Rishab Shetty: ఆ ప్రచారంలో నిజం లేదు.. ‘కాంతార’ వివాదంపై స్పందించిన రిషబ్ శెట్టి

Rishab Shetty Responds to Kantara Controversy No Truth in that Promotion
  • 'కాంతార చాప్టర్ 1' సినిమాపై వివాదాస్పద పోస్టర్‌పై రిషబ్ శెట్టి క్లారిటీ
  •  ‘కాంతార’ చూడాలంటే మాంసం తినొద్దు, మద్యం సేవించకూడదని పోస్ట‌ర్‌ 
  • ఆ ప్రచారంలో నిజం లేదని, అది నకిలీ పోస్టర్ అని వెల్లడి
  • ఎవరు ఏం తినాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్య
  • షూటింగ్ సమయంలో నాలుగుసార్లు మృత్యువు అంచులదాకా వెళ్లానన్న నటుడు
కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి సృష్టించిన ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార చాప్టర్ 1’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో సినిమా గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ వివాదాస్పద ప్రచారంపై రిషబ్ శెట్టి స్పష్టతనిచ్చారు.

బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ, ‘కాంతార’ సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులు మాంసాహారం తినకూడదని, మద్యం సేవించకూడదని సూచిస్తూ వైరల్ అవుతున్న పోస్టర్‌కు, తమ నిర్మాణ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్ప‌ష్టం చేశారు. “అది పూర్తిగా నకిలీ పోస్టర్. ఎవరో కావాలనే దీన్ని సృష్టించారు. విషయం మా దృష్టికి రాగానే వారు ఆ పోస్టర్‌ను తొలగించి క్షమాపణలు చెప్పారు” అని ఆయన తెలిపారు.

కొందరు ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రిషబ్ శెట్టి అన్నారు. “ప్రతి ఒక్కరికీ వారి వారి ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఉంటాయి. వాటిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఒక సినిమా ట్రెండ్‌గా మారినప్పుడు, కొందరు తమ సొంత ఆలోచనలతో దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని చూస్తారు” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో సినిమా బృందం మొత్తం షూటింగ్ సమయంలో మద్యం, ధూమపానానికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసినట్లు వచ్చిన మరో పోస్టర్‌ను కూడా ఆయన ఖండించారు.

నాలుగుసార్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డా
ఇక‌, ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను కూడా రిషబ్ శెట్టి పంచుకున్నారు. “చిత్రీకరణ సమయంలో నేను నాలుగుసార్లు తీవ్ర ప్రమాదాల బారిన పడ్డాను. ఆ సమయంలో దాదాపు చనిపోయేవాడిని. కానీ, ఆ దేవుడి దయ వల్లే నేను బతికి ఉన్నాను. ఆయన వల్లే ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది” అని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రంపై నిన్న విడుద‌లైన‌ ట్రైలర్ మరింత ఆసక్తిని రేకెత్తించింది.
Rishab Shetty
Kantara
Kantara Chapter 1
Kannada movie
Movie controversy
Fake poster
Shooting experience
Film promotions
Bengaluru
Pre-quel

More Telugu News