H-1B Visa: హెచ్-1బీ ఫీజుల పెంపు.. భారత ఐటీపై తక్షణ ప్రభావంపై నివేదిక ఏం చెబుతోందంటే..!

Impact of H1B visa hike to be minimum on Indian IT firms says Report
  • హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంపు
  • భారత ఐటీ కంపెనీలపై తక్షణ ప్రభావం స్వల్పమేనన్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నివేదిక
  • స్థానికంగా నియామకాలు, ఆఫ్‌షోరింగ్‌పై ఆధారపడటమే కారణమ‌ని వెల్ల‌డి
  • ఆఫ్‌షోరింగ్, ఆటోమేషన్‌ వైపు కంపెనీల మొగ్గు
  • భారత్‌లోని టెక్కీలకు జీసీసీలలో పెరగనున్న ఆకర్షణ
అమెరికా హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచినా, భారత ఐటీ సేవల సంస్థలపై తక్షణ ప్రభావం పరిమితంగానే ఉంటుందని ఓ ప్రముఖ నివేదిక స్పష్టం చేసింది. గత దశాబ్ద కాలంగా భారత ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నివేదిక మంగళవారం వెల్లడించింది. అమెరికాలోనే స్థానికంగా నిపుణులను నియమించుకోవడం (లోకలైజేషన్), ఎక్కువ ప్రాజెక్టులను భారత్‌కు తరలించడం (ఆఫ్‌షోరింగ్) వంటి వ్యూహాలను అనుసరించడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని తెలిపింది.

అయితే, తక్షణ ప్రభావం తక్కువే అయినప్పటికీ మధ్య కాలంలో మాత్రం సవాళ్లు తప్పవని నివేదిక హెచ్చరించింది. అమెరికాలో ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం భారీగా పెరిగిపోతుందని, ఇది కంపెనీల ఆర్థిక ప్రణాళికలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఈ పెరిగిన ఖర్చులను అధిగమించేందుకు ఐటీ సంస్థలు తమ వ్యాపార నమూనాలను పునఃసమీక్షించుకోవాల్సి వస్తుందని వివరించింది.

ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు కంపెనీలు కొన్ని కీలక వ్యూహాలను అనుసరించవచ్చని నివేదిక అంచనా వేసింది. ఆఫ్‌షోరింగ్‌ను మరింత వేగవంతం చేయడం, కెనడా, మెక్సికో వంటి సమీప దేశాల్లో తమ కార్యకలాపాలను విస్తరించడం వంటివి అందులో ముఖ్యమైనవి. అలాగే, భౌగోళికంగా వైవిధ్యం కోసం ఐరోపా, ఆసియా-పసిఫిక్ దేశాల్లో ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం, ఉత్పాదకతను పెంచుకునేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టడం వంటి చర్యలు చేపడతాయని తెలిపింది.

ఈ మార్పుల వల్ల అమెరికాలో ఆన్‌సైట్ అవకాశాలు తగ్గి, భారత్‌లోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) టెక్కీలకు మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఫీజుల పెంపు వాస్తవ ప్రభావం 2027 ఆర్థిక సంవత్సరం నుంచి కనిపించవచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని, 2025 ద్వితీయార్థంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే మార్కెట్‌కు అది సానుకూల అంశంగా మారుతుందని నివేదిక అభిప్రాయపడింది.
H-1B Visa
Indian IT
H-1B visa fees
Franklin Templeton report
Offshoring
Localization
US-India trade
Global Capability Centers
GCCS
IT industry

More Telugu News