Mallojula Venugopal: ఆయుధాలు అప్పగించాలి.. భూపతికి మావోయిస్టు కేంద్ర కమిటీ హెచ్చరిక

Mallojula Venugopal Ordered to Surrender Arms by Maoist Central Committee
  • మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం బహిర్గతం
  • సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్‌ (భూపతి)పై కేంద్ర కమిటీ చర్యలు
  • భూపతిని ద్రోహిగా పేర్కొంటూ సంచలన ప్రకటన
  • వెంటనే ఆయుధాలు అప్పగించాలని తీవ్ర హెచ్చరిక
  • శాంతి చర్చలపై భూపతి ప్రకటనను ఖండించిన పార్టీ
మావోయిస్టు పార్టీలో తీవ్ర అంతర్గత సంక్షోభం బయటపడింది. పార్టీ కేంద్ర కమిటీ తమ సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిపై సంచలన చర్యలు తీసుకుంది. ఆయన్ని పార్టీ ద్రోహిగా ప్రకటిస్తూ, వెంటనే తన వద్ద ఉన్న ఆయుధాలను పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆయుధాలు అప్పగించని పక్షంలో, వాటిని పీపుల్స్ గెరిల్లా ఆర్మీ (పీజీఏ) స్వాధీనం చేసుకుంటుందని కమిటీ తీవ్రంగా హెచ్చరించింది. ఇటీవల భూపతి, తాము ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ విధానానికి విరుద్ధంగా ఉన్న ఈ ప్రకటనతోనే వివాదం మొదలైంది.

భూపతి ప్రకటనను కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. లొంగిపోయే ఉద్దేశంతోనే ఆయన ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది. కాల్పుల విరమణ, శాంతి చర్చల పేరుతో భూపతి పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర కమిటీ తన ప్రకటనలో పేర్కొంది. కాగా, మల్లోజుల వేణుగోపాల్ దివంగత మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీకి స్వయానా తమ్ముడు కావడం గమనార్హం. ఈ పరిణామం మావోయిస్టు పార్టీలోని ఉన్నతస్థాయి నాయకత్వంలో తీవ్ర విభేదాలు ఉన్నాయన్న వాదనలకు బలం చేకూరుస్తోంది. 
Mallojula Venugopal
Bhupathi
Maoist Central Committee
CPI Maoist
Naxalites
People's Guerrilla Army
Kishanji
Maoist internal conflict
surrender
peace talks

More Telugu News