Student Suicide: బార్ బిల్లు గొడవ.. సీనియర్ల వేధింపులకు జూనియర్​ విద్యార్థి ఆత్మహత్య

Student commits suicide due to bar bill harassment
  • సీనియర్ వేధింపులతో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
  • గొడవ రాజీ చేసినందుకు సీనియ‌ర్ల‌ మందు పార్టీ డిమాండ్
  • రూ. 8 వేల బార్ బిల్లు కట్టలేదని తీవ్ర అవమానం
  • ఎనిమిది మంది విద్యార్థులపై ఎట్రాసిటీ కేసు నమోదు
  • కళాశాల వద్ద విద్యార్థి సంఘాల భారీ ఆందోళన
జూనియర్ల మధ్య తలెత్తిన చిన్న గొడవను రాజీ చేసినందుకు ప్రతిఫలంగా పార్టీ అడిగాడో సీనియర్. ఆ పార్టీలో అయిన బిల్లును చెల్లించలేకపోయినందుకు జూనియర్‌ను తీవ్రంగా అవమానించడంతో, అతను తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జాదవ్ సాయితేజ, ఘట్‌కేసర్‌లోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. నారపల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న సాయితేజ, తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి మొదటి సంవత్సరం విద్యార్థి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు. అక్కడ వారి మధ్య స్వల్ప వివాదం జరగడంతో సీనియర్ విద్యార్థి బండారి చిన్నబాబు జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పి రాజీ కుదిర్చాడు.

అయితే, ఈ రాజీకి ప్రతిఫలంగా పార్టీ ఇవ్వాలంటూ చిన్నబాబు డిమాండ్ చేశాడు. ఆదివారం రాత్రి సాయితేజను మరో ఏడుగురు విద్యార్థులతో కలిసి నారపల్లిలోని ఓ బార్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగగా, రూ. 8,000 బిల్లు అయింది. సాయితేజ వద్ద రూ. 2,500 మాత్రమే ఉండటంతో ఆ మొత్తాన్ని చెల్లించాడు. మిగిలిన డబ్బు కోసం చిన్నబాబు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో పాటు అందరి ముందూ అవమానకరంగా మాట్లాడాడు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయితేజ హాస్టల్‌కు తిరిగి వెళ్లిపోయాడు. తన తండ్రి ప్రేమ్‌సింగ్‌కు వీడియో కాల్ చేసి, చిన్నబాబు వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆందోళన చెందిన తండ్రి వెంటనే హాస్టల్ నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు గదికి వెళ్లి చూసేలోపే సాయితేజ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు 8 మంది విద్యార్థులపై ఎట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ ఆర్. గోవిందారెడ్డి తెలిపారు. సాయితేజ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద, మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట, వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆందోళనలు చేపట్టాయి. ఈ ఘటనపై స్పందించిన కళాశాల యాజమాన్యం, ప్రధాన నిందితుడైన చిన్నబాబు గత ఏడాది నుంచి తరగతులకు హాజరుకావడం లేదని ఓ ప్రకటనలో పేర్కొంది.
Student Suicide
Jadhav Sai Teja
Siddhartha Engineering College
ragging
bar bill dispute
Medipally police station
Etrositi case
junior student harassment
alcohol bill

More Telugu News