Uttam Kumar Reddy: తెలంగాణ ప్రాజెక్టు.. ఎన్ఓసీ జారీ చేసేందుకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఓకే

Uttam Kumar Reddy Secures Chhattisgarh CM Nod for Telangana Project
  • ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ఓసీ జారీ చేయాలని విష్ణుదేవ్ సాయ్‌ని కలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ముంపు ప్రాంత భూసేకరణ, పరిహారం చెల్లిస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ఎన్ఓసీ జారీ చేసేందుకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అంగీకారం
గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయడానికి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ అంగీకరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం రాయ్‌పూర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ఓసీ జారీ చేయాలని కోరారు. సహాయ, పునరావాస చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

దీంతో ఎన్ఓసీ జారీ చేయడానికి విష్ణుదేవ్ సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో నీటి లభ్యతను పెంచడానికి గోదావరిపై 6.7 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు వెనుక జలాల వల్ల ఛత్తీస్‌గఢ్‌లో కొంత భాగం ముంపునకు గురవుతోంది. ముంపు ప్రాంతంలో భూసేకరణ, పరిహారం చెల్లించే విషయంపై ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చించారు. ఇదే అంశంపై ఎన్ఓసీ జారీ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విష్ణుదేవ్ సానుకూల స్పందనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం ప్రాజెక్టు సాధనలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఒక ముందడుగు అని ఆయన అభివర్ణించారు. ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాస బాధ్యతను పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే తీసుకుంటుందని వివరిస్తూ ఒక హామీ పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. ఎన్‌ఓసీ అనేది కేంద్ర జల సంఘం ఆమోదం పొందడానికి అవసరమైన చివరి అంతర్రాష్ట్ర అనుమతి అని, అది లేనిదే ప్రాజెక్టు ముందుకు సాగదని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ విస్తృతంగా లాభపడినా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలోని భూపాలపట్నం తహసీల్‌లోకి విస్తరించి ముంపు కలిగిస్తుందని ఆయన అంగీకరించారు. సుమారు 13.06 హెక్టార్ల భూమి, 54.03 హెక్టార్ల నది ప్రాంతం, 6.35 హెక్టార్ల నాళా భూమి ప్రభావితమవుతాయని ఆయన వివరించారు. ఈ ప్రభావంపై ఛత్తీస్‌గఢ్ ఇదివరకే తన ఆందోళనలను వ్యక్తపరిచిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఆందోళనలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి, వాటిని పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. ముంపుతో ముడిపడిన అన్ని ఖర్చులను, ఛత్తీస్‌గఢ్ పరిధిలోని భూసేకరణ, పునరావాస బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వమే భరించడానికి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
Uttam Kumar Reddy
Sammakka Sagar project
Chhattisgarh
Vishnu Deo Sai
Telangana projects

More Telugu News