Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాజీ డీఎస్పీ నళినిని కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్

Revanth Reddy Orders Collector to Meet Former DSP Nalini
  • నళిని నివాసానికి వెళ్లి కలిసిన కలెక్టర్ హనుమంతరావు
  • నళిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన కలెక్టర్
  • సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ
  • సర్వీస్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానన్న కలెక్టర్
అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ డీఎస్పీ నళినిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరామర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ ఆమె నివాసానికి వెళ్లి మాట్లాడారు. నళిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఆమె సర్వీస్ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారని ఆయన వెల్లడించారు. నళిని చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు.

గతంలో వైద్యపరంగా అయిన ఖర్చులను కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేస్తామని, ఇంకా ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారని కలెక్టర్ నళినికి తెలియజేశారు.

నళినిని కలిసిన అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, తాను ఆయుర్వేద వైద్యం, యోగా ద్వారా కోలుకుంటున్నానని, ప్రస్తుతం పెద్దగా ఖర్చేమీ కాదని ఆమె చెప్పారని తెలిపారు. ఆమె తన సర్వీస్ నిబంధనల గురించి అభ్యర్థించారని, ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని కలెక్టర్ పేర్కొన్నారు. నళిని త్వరలో పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

కాగా, భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన నళిని తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానంటూ వీలునామా, మరణ వాంగ్మూలం పేరిట ఒక లేఖను ఆదివారం తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పోస్టు చేశారు. ఇది సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ నళినిని కలిసి పరామర్శించారు.
Revanth Reddy
Nalini DSP
Yadadri Bhuvanagiri
Hanumanth Rao Collector
Telangana Government

More Telugu News