Narendra Modi: జీఎస్టీ సంస్కరణలు... లేఖను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Narendra Modi releases letter on GST reforms
  • ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ పండుగ మొదలైందని వెల్లడి
  • జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక వృద్ధితో పాటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయన్న మోదీ
  • వ్యాపారులు స్వదేశీ ఉత్పత్తులనే విక్రయించాలని విజ్ఞప్తి
  • ప్రజలు స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలపై ఒక లేఖను విడుదల చేశారు. ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ పండుగ ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు రాబోయే తరాల ప్రజల్లో పొదుపును పెంచుతాయని ఆయన అన్నారు. ఈ సంస్కరణల ద్వారా రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు, ఎంఎస్ఎంఈలతో సహా అన్ని వర్గాల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతుందని హామీ ఇచ్చారు.

జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక వృద్ధితో పాటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని, ప్రతి రాష్ట్రం యొక్క ప్రగతిని వేగవంతం చేస్తాయని ఆయన వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ సరళీకృతం కావడంతో పాటు వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందని తెలిపారు. తమ ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా కొన్నేళ్లలోనే 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు.

ఆదాయపు పన్నును రూ. 12 లక్షల వరకు మినహాయించడం, జీఎస్టీ సంస్కరణల వంటి కార్యక్రమాలతో ప్రజలకు ఒక్క ఏడాదిలోనే రూ. 2.50 లక్షల కోట్ల డబ్బు ఆదా కానుందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు స్థానిక తయారీ రంగాన్ని బలోపేతం చేస్తాయని తెలిపారు. దుకాణదారులు స్వదేశీ తయారీ ఉత్పత్తులనే విక్రయించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాష్ట్రాలు పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.
Narendra Modi
GST reforms
Goods and Services Tax
Indian economy
Tax savings
MSME
Economic growth India

More Telugu News