Pawan Kalyan: ఈ నెల 25న డీఎస్సీ నియామక పత్రాల అందజేత... పవన్ ను ఆహ్వానించిన లోకేశ్

Pawan Kalyan Invited by Nara Lokesh for DSC Appointment Letter Ceremony
  • అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్‌తో మంత్రి లోకేశ్ భేటీ
  • డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానం
  • పలు అంశాలపై ఇరువురు నేతల మధ్య సంభాషణ
  • ఇటీవలే 16,347 ఉపాధ్యాయ పోస్టుల తుది జాబితా విడుదల
  • విజయవంతంగా ముగిసిన మెగా డీఎస్సీ-2025 ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభా కార్యక్రమాలకు విరామం ఇచ్చిన సమయంలో వీరిద్దరూ భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా, రాష్ట్రంలో ఇటీవల పూర్తయిన మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి పవన్ కల్యాణ్‌ను మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. 

ఈ నెల 25వ తేదీన డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ కొలువుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను సెప్టెంబర్ 15న విడుదల చేసిన విషయం తెలిసిందే.

 పవన్ ను కలిసి సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ... గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు దాదాపు 106 కేసులు వేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో  ఇచ్చిన మాట నిలుపుకుందని అన్నారు. దీనివల్ల  ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ టీచర్ల కలలు సాకారం అయ్యాయని మంత్రి లోకేశ్ వివరించారు. 

ప్రభుత్వ, పురపాలక, గిరిజన సంక్షేమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీల భర్తీ కోసం ఈ ఏడాది ఏప్రిల్ 20న ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జులై 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. అనంతరం టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇస్తూ, ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసి తుది జాబితాను రూపొందించారు.

ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్, విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. నియామక ప్రక్రియ చివరి అంకానికి చేరుకోవడంతో, అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది.
Pawan Kalyan
Nara Lokesh
AP DSC 2024
Teacher Recruitment
Andhra Pradesh Government
Education Department
Appointment Letters
Mega DSC
AP Teachers
Teacher Jobs

More Telugu News