హెచ్-1బీకి చెక్.. చైనా సరికొత్త 'కే-వీసా' విధానం

  • విదేశీ నిపుణుల కోసం చైనా కొత్తగా 'కే-వీసా' విధానం
  • సైన్స్, టెక్నాలజీ, స్టెమ్ రంగాల్లోని యువతే లక్ష్యం
  • వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ కొత్త వీసా అమలు
  • స్థానిక కంపెనీ స్పాన్సర్‌షిప్ లేకుండానే వీసా పొందే అవకాశం
  • అమెరికా హెచ్-1బీ నిబంధనలు కఠినతరం అవుతున్న వేళ కీలక నిర్ణయం
అంతర్జాతీయంగా నిపుణులను ఆకర్షించడంలో అమెరికాకు గట్టి పోటీ ఇచ్చేందుకు చైనా సిద్ధమైంది. విదేశీ యువ ప్రతిభావంతులను తమ దేశానికి రప్పించే లక్ష్యంతో 'కే-వీసా' పేరుతో సరికొత్త వీసా విధానాన్ని ప్రకటించింది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) రంగాల్లోని నిపుణులకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాలో వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచడం వంటి చర్యలతో భారత్, చైనా లాంటి దేశాల నిపుణులకు అవకాశాలు తగ్గుతున్నాయని భావిస్తున్న తరుణంలో, చైనా ఈ కొత్త వీసాతో వారికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపుతోంది.

ఈ కే-వీసా నిబంధనలను చాలా సరళంగా రూపొందించారు. ముఖ్యంగా, వీసా కోసం స్థానిక కంపెనీ స్పాన్సర్‌షిప్ అవసరం లేకపోవడం నిపుణులకు అతిపెద్ద ఊరట. ప్రస్తుతం చైనాలో 12 రకాల వీసా కేటగిరీలు ఉండగా, ఇప్పుడు కే-వీసాను 13వ కేటగిరీగా చేర్చారు.

ఎవరు అర్హులు?
ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా పరిశోధన సంస్థ నుంచి స్టెమ్ విభాగాల్లో కనీసం బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. తమ అర్హతను నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అమెరికా వెలుపల కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎందరో ప్రతిభావంతులకు చైనా నిర్ణయం కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది.


More Telugu News