రాష్ట్రాల ఆదాయం జీతాలు, పెన్షన్లకే.. అభివృద్ధికి నిధులెక్కడ?: కాగ్ నివేదికలో ఆందోళనకర విషయాలు

  • పదేళ్లలో మూడు రెట్లు పెరిగిన రాష్ట్రాల అప్పులు
  • జీతాలు, పెన్షన్లు, వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు
  • అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత
  • ఏపీ, తెలంగాణలో పెన్షన్ల కంటే వడ్డీ చెల్లింపులే అధికం
  • రాష్ట్రాల ఆర్థిక తీరుపై కాగ్ తీవ్ర ఆందోళన
  • అమాంతం పెరిగిపోయిన సబ్సిడీల భారం
దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. గడిచిన పదేళ్లలోనే రాష్ట్రాల రుణభారం ఏకంగా మూడు రెట్లు పెరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన తాజా నివేదికలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రాలు ఆర్జిస్తున్న ఆదాయంలో అధిక భాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీల చెల్లింపులకే సరిపోతుండటంతో.. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని దుస్థితి నెలకొందని స్పష్టం చేసింది.

కాగ్ నివేదిక ప్రకారం, 2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 28 రాష్ట్రాల మొత్తం అప్పులు రూ.17.57 లక్షల కోట్లుగా ఉండగా, 2022-23 నాటికి అది రూ.59.60 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, తీసుకున్న అప్పులపై వడ్డీల చెల్లింపులు వంటి ‘నిబద్ధ వ్యయం’ కూడా భారీగా పెరిగింది. పదేళ్ల క్రితం రూ.6.26 లక్షల కోట్లుగా ఉన్న ఈ ఖర్చు, 2022-23 నాటికి రూ.15.63 లక్షల కోట్లకు ఎగబాకింది.

ఈ ఖర్చు రాష్ట్రాల మొత్తం రెవెన్యూ వ్యయంలో దాదాపు సగం వాటాను ఆక్రమిస్తోంది. వీటికి అదనంగా సబ్సిడీలు, గ్రాంట్లను కూడా కలిపితే, రాష్ట్రాలు ఖర్చు చేసే ప్రతి ఐదు రూపాయలలో నాలుగు రూపాయలకు పైగా ఈ చెల్లింపులకే పోతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. 2022-23లో మొత్తం రెవెన్యూ వ్యయంలో ఈ మూడింటి వాటా ఏకంగా 83 శాతంగా ఉందని కాగ్ తేల్చింది. దీనివల్ల మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడుతోందని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా గుజరాత్, పంజాబ్, తమిళనాడు వంటి తొమ్మిది రాష్ట్రాల్లో పెన్షన్ల కంటే వడ్డీల చెల్లింపులకే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది. మరోవైపు సబ్సిడీలపై వ్యయం కూడా గత దశాబ్దంలో 3.21 రెట్లు పెరిగి రూ.3.09 లక్షల కోట్లకు చేరినట్లు కాగ్ తెలిపింది. 2022-23లో ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడ్డాయని, కేవలం 12 రాష్ట్రాలు మాత్రమే రెవెన్యూ మిగులు లక్ష్యాన్ని చేరుకోగలిగాయని వివరించింది. ఈ ఆర్థిక ధోరణులు భవిష్యత్తులో రాష్ట్రాల అభివృద్ధి అవకాశాలకు పెద్ద సవాలుగా మారనున్నాయని కాగ్ హెచ్చరించింది.


More Telugu News