Chanderpal: కేబీసీలో సత్తా చాటిన కార్పెంటర్

Chanderpal Wins 50 Lakhs on KBC
  • కేబీసీలో రూ.50 లక్షలు గెలిచిన కార్పెంటర్ చందర్‌పాల్‌
  • కేబీసీలో పాల్గొనాలన్న లక్ష్యంతో గత ఐదేళ్లుగా శ్రమించి, చివరకు హాట్‌సీట్‌ వరకూ వచ్చానన్న చందర్‌పాల్ 
  • తన లాంటి సామాన్యుడికి కేబీసీలో పాల్గొనే అవకాశం రావడం గొప్ప విషయమన్న చందర్‌పాల్.
ఆత్మవిశ్వాసముంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు పంజాబ్‌కు చెందిన ఓ సాధారణ కార్పెంటర్. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ టీవీ క్విజ్‌ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)’లో అతను పాల్గొని అరుదైన ఘనతను కైవసం చేసుకున్నాడు.

జలంధర్‌ జిల్లాలోని హుస్సేన్‌పుర్‌ గ్రామానికి చెందిన చందర్‌పాల్ వ్యూహాత్మకంగా ఆడుతూ రూ. 50 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. వడ్రంగి వృత్తిలో కొనసాగుతున్న చందర్‌పాల్ చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వంతో జీవితంలో ఏదైనా సాధించాలనే తపన, పట్టుదలతో ఉండేవాడు.

సాధారణ విద్యను అభ్యసించినప్పటికీ వివిధ అంశాలపై జ్ఞానం పెంపొందించుకునేందుకు కష్టపడ్డాడు. కేబీసీలో పాల్గొనాలన్న లక్ష్యంతో గత ఐదేళ్లుగా శ్రమించి, చివరకు హాట్‌సీట్‌ వరకూ చేరగలిగాడు. అక్కడ ఎదురైన కఠిన ప్రశ్నలకు ఆడియన్స్‌ పోల్‌, 50-50 వంటి లైఫ్‌లైన్లను సద్వినియోగం చేసుకుని రూ.50 లక్షలను కైవసం చేసుకున్నాడు.

విజేతగా నిలిచిన చందర్‌పాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన ప్రయత్నాల గురించి కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు ముందుగా చెప్పలేదని, తెలిస్తే నిరుత్సాహపరిచే అవకాశం ఉంటుందన్న భయంతో రహస్యంగా చదువుకున్నట్లు తెలిపాడు.

కేబీసీకి వచ్చే వారిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారని, కానీ తన లాంటి సామాన్యుడికి అవకాశం రావడం గొప్ప విషయమని అన్నారు. తను గెలుచుకున్న డబ్బును పిల్లల చదువుతో పాటు తన వ్యాపార విస్తరణ కోసం వినియోగించనున్నట్లు తెలిపాడు. 
Chanderpal
KBC
Kaun Banega Crorepati
Amitabh Bachchan
Carpenter
Jalandhar
Hussainpur
Punjab
Indian Quiz Show

More Telugu News