Rahul Gandhi: అఫ్రిదీ కూడా పొగుడుతున్నాడు... రాహుల్ గాంధీ పాక్ పౌరసత్వం తీసుకోవాలన్న బీజేపీ నేత

BJP Leader Says Rahul Gandhi Should Take Pakistani Citizenship
  • రాహుల్ గాంధీపై బీజేపీ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ తీవ్ర విమర్శలు
  • రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ 90కి పైగా ఎన్నికల్లో ఓడిపోయిందన్న అలోక్
  • భారత్‌లో పట్టించుకునేవారు లేరు, పాకిస్థాన్ పౌరసత్వం తీసుకోవాలని ఎద్దేవా
  • తేజస్వి యాదవ్ చేపట్టిన యాత్ర జైలు యాత్రతో ముగుస్తుందని జోస్యం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 90కి పైగా ఎన్నికల్లో ఓడిపోయిందని, ఇది ఒక ప్రపంచ రికార్డు అని ఆయన ఎద్దేవా చేశారు. భారత్‌లో రాహుల్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఆయన పాకిస్థాన్ పౌరసత్వం తీసుకుంటే మంచిదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఆదివారం ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ అజయ్ అలోక్ ఈ వ్యాఖ్యలు చేశారు. "రాహుల్ గాంధీ ఇప్పటికే ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ 90కి పైగా ఎన్నికల్లో ఓడిపోయింది. భారతదేశంలో ప్రజలు ఆయన్ను సీరియస్‌గా తీసుకోవడం మానేశారు. అందుకే నాదొక సలహా, ఆయన పాకిస్థాన్ పౌరసత్వం తీసుకోవాలి. అక్కడ ఆయనకు మంచి ఆదరణ ఉంది. చివరికి షాహిద్ అఫ్రిదీ కూడా ఆయన్ను పొగుడుతున్నాడు. ఇక భారత్‌లో ఆయనతో పనేముంది?" అని అలోక్ ప్రశ్నించారు.

బీహార్‌లో తేజస్వి యాదవ్ చేపట్టిన యాత్రపైనా అజయ్ అలోక్ స్పందించారు. అది కేవలం తన రాజకీయ మనుగడ కోసం చేస్తున్న పోరాటమని విమర్శించారు. "మొదట కాంగ్రెస్‌ను కాపాడటానికి రాహుల్ గాంధీ యాత్ర చేశారు. ఇప్పుడు తేజస్వి కూడా యాత్ర మొదలుపెట్టారు. కానీ చివరికి అది జైలు యాత్రతోనే ముగుస్తుంది" అని ఆయన జోస్యం చెప్పారు.


Rahul Gandhi
Ajay Alok
BJP
Congress
Pakistan Citizenship
Shahid Afridi
Tejaswi Yadav
Bihar Politics

More Telugu News