ఏసీ బోగీలో దుప్పట్లు ఎత్తుకెళుతూ పట్టుబడ్డ ప్రయాణికులు.. వీడియో ఇదిగో!

  • ఢిల్లీ నుంచి పూరికి థర్డ్ ఏసీలో ప్రయాణించిన కుటుంబం
  • దిగేముందు బెడ్ షీట్లు బ్యాగుల్లో తీసుకెళ్లేందుకు ప్రయత్నం
  • కోచ్ అటెండెంట్ ఫిర్యాదుతో బ్యాగులు తనిఖీ చేసిన టీటీఈ
ఏసీ కోచ్ లో జర్నీ చేసిన ముగ్గురు ప్రయాణికులు.. రైలు దిగిపోతూ రైల్వే శాఖ ఇచ్చిన దుప్పట్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, కోచ్ అటెండెంట్ ఫిర్యాదుతో టీటీఈ సదరు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయడంతో ఈ దొంగతనం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు సదరు ప్రయాణికులపై మండిపడుతున్నారు. ఇదేం కురచబుద్ది అంటూ విమర్శిస్తున్నారు.

ఆలయ దర్శనానికి వెళుతూ..
ఢిల్లీకి చెందిన ఓ యువకుడు తన తల్లి, సోదరుడితో కలిసి ఒడిశాలోని పూరి ఆలయ సందర్శనకు వెళ్లాడు. వారు ముగ్గురూ పురుషోత్తం ఎక్స్ ప్రెస్ లో థర్డ్ ఏసీలో ప్రయాణించారు. ఏసీ కోచ్ కావడంతో రైల్వే సిబ్బంది వారికి బెడ్ షీట్లు, టవల్స్ అందించారు. ప్రయాణంలో ఉపయోగించుకుని వాటిని అక్కడే వదిలేయాల్సి ఉండగా.. సదరు ప్రయాణికులు మాత్రం ఎంచక్కా ఆ దుప్పట్లు, టవల్స్ ను మడతపెట్టి తమ బ్యాగుల్లో సర్దేసుకున్నారు. ఆపై ఏమీ తెలియనట్లు రైలు దిగి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.

పొరపాటున చేశామని వివరణ..
ఇది గమనించిన కోచ్ అటెండెంట్ వెంటనే టీటీఈకి ఫిర్యాదు చేశాడు. టీటీఈ కల్పించుకుని ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయగా.. బెడ్ షీట్లు, టవల్స్ బయటపడ్డాయి. అయితే, తన తల్లి పొరపాటున వాటిని బ్యాగులో పెట్టి ఉండొచ్చని ఆ యువకుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, టీటీఈ మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనే అంటూ వారికి రూ.780 జరిమానా విధించాడు. ఆ మొత్తం వెంటనే చెల్లించకపోతే రైల్వే ఆస్తుల పరిరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో సదరు ప్రయాణికులు ఆ జరిమానా కట్టేసి వెళ్లిపోయారు.


More Telugu News