Nara Lokesh: చిట్టి తల్లీ సీటు ఇప్పిస్తా.. నిశ్చింతగా చదువుకో: నారా లోకేశ్

Nara Lokesh Assures Seat for Jessie in KGBV
––
కేజీబీవీలో సీటు లభించకపోవడంతో పత్తి చేలలో కూలీ పనులకు వెళుతున్న జెస్సీ దుస్థితి తనను కదిలించి వేసిందని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు ఓ వార్తా పత్రికలో వచ్చిన జెస్సీ కథనంపై ఆయన స్పందించారు. కేజీబీవీ అధికారులతో ఇప్పటికే మాట్లాడానని, జెస్సీకి సీటు ఇప్పిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా చదువుకోవాలనే జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు మంత్రి అభినందనలు తెలిపారు.

అసలేం జరిగిందంటే..
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని బూదూరు గ్రామానికి చెందిన జెస్సీ అనే విద్యార్థినికి కేజీబీవీలో సీటు దక్కలేదు. పేద కుటుంబానికి చెందిన జెస్సీ తల్లిదండ్రులకు ఆమెను చదివించడం ఆర్థిక భారంగా మారింది. దీంతో ఆమెను కూలి పనులకు తీసుకెళుతున్నారు. పత్తి పొలంలో జెస్సీ కూలీ పని చేస్తున్న ఫొటోతో ఓ వార్తా పత్రిక చదువుకోవాలని ఉన్నా స్తోమత లేక కూలీగా మారిన చిన్నారి అంటూ కథనం ప్రచురించింది.

ఈ కథనంపై మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ‘‘చిట్టి తల్లీ! కేజీబీవీలో నీకు సీటు వస్తుంది. నిశ్చింతగా చదువుకో!” అంటూ ఆ చిన్నారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా.. ‘పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరం. మీరు పిల్లలను బడికి పంపితే తల్లికి వందనం వస్తుంది. చక్కనైన యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్టు ఇస్తున్నాం. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. మనబడిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత మాది. పిల్లల భద్రత -భవితకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం లేదు. విద్యకు పిల్లలను దూరం చేయొద్దు’ అని మంత్రి నారా లోకేశ్ విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
Nara Lokesh
Jessie
KGGBV
Kurnool District
Education
Child Labor
Andhra Pradesh Education
Mandalayam
School Admission
Poverty

More Telugu News