H1B Visa: అమెరికన్ల స్థానంలో హెచ్ 1బీ ఉద్యోగుల నియామకం.. ట్రంప్ సర్కారు ఆరోపణ

H1B Visa Fee Hike Explained Protecting American Jobs
  • స్థానిక ఉద్యోగుల ప్రయోజనాలకే వీసా ఫీజు పెంపు
  • కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దొరకట్లేదు
  • 5 వేలకుపైగా హెచ్ 1 బీ వీసాలు పొందిన ఓ కంపెనీ 16 వేల మంది అమెరికన్లను తొలగించిందన్న వైట్ హౌస్
అమెరికన్ల ప్రయోజనాలను కాపాడడానికి, స్థానిక ఉద్యోగుల భద్రత కోసమే హెచ్ 1బీ వీసా ఫీజును పెంచినట్లు వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. వీసా ఫీజును భారీగా పెంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో తాజాగా స్పందించింది. దేశంలోని పలు కంపెనీలు అమెరికన్ వర్కర్ల స్థానాన్ని హెచ్ 1 బీ ఉద్యోగులతో భర్తీ చేస్తున్నాయని ఆరోపించింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక స్థానిక కంపెనీ దరఖాస్తు చేసుకున్న 5,189 హెచ్ 1బీ వీసాలకు అనుమతి రాగానే దాదాపు 16 వేల మంది అమెరికన్లను పనిలో నుంచి తొలగించిందని వైట్ హౌస్ ఓ ప్రకటనలో ఉదహరించింది. మరో కంపెనీకి 1,698 హెచ్ 1బీ వీసాలు జారీ చేయగా.. 2,400 మంది అమెరికన్లను ఉద్యోగం నుంచి తొలగించిందని, మూడో కంపెనీకి 2022 నుంచి ఇప్పటి వరకు 25 వేల హెచ్ 1బీ వీసాలు జారీ చేస్తే.. సుమారు 27 వేల మంది స్థానిక ఉద్యోగులను ఇంటికి పంపించిందని వైట్ హౌస్ ఆరోపించింది.

అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నందునే వీసా ఫీజును భారీగా పెంచామని తెలిపింది. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన అమెరికన్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దొరకడం లేదని, వీరి నిరుద్యోగిత శాతం వరుసగా 6.5, 7.5 శాతంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించడం, ఉద్యోగ అవకాశాలను పెంచడానికే ట్రంప్ ప్రభుత్వం హెచ్ 1బీ వీసా ఫీజును పెంచినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో స్థానిక కంపెనీలు అత్యంత నిపుణులను, కంపెనీకి అత్యవసరమైన వారిని మాత్రమే విదేశాల నుంచి రప్పించుకుంటాయని వైట్ హౌస్ అభిప్రాయపడింది.
H1B Visa
Trump administration
US jobs
American workers
visa fees
job security
layoffs
computer science graduates
computer engineering

More Telugu News