ఇది నా ఒక్కడిది కాదు.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుపై మోహన్‌లాల్ భావోద్వేగం

  • మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
  • కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారిక ప్రకటన
  • నాలుగు దశాబ్దాల సినీ సేవలకు గొప్ప గౌరవం
  • ఈ గౌరవం తన ఒక్కడిది కాదన్న కంప్లీట్ యాక్టర్
  • ఇది త‌న‌ ప్రయాణంలో తోడున్న ప్రతి ఒక్కరిదంటూ ఎమోష‌న‌ల్‌ ట్వీట్‌
  • మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన మోహన్‌లాల్‌
ప్రముఖ మలయాళ నటుడు, 'కంప్లీట్ యాక్టర్' మోహన్‌లాల్‌ను భారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించిన విష‌యం తెలిసిందే. నాలుగు దశాబ్దాలుగా సినీ రంగానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ అరుదైన గౌరవం దక్కడంపై మోహన్‌లాల్ స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా ఆయన తన ఆనందాన్ని, కృతజ్ఞతలను పంచుకున్నారు. ఈ పురస్కారం తన ఒక్కడిదే కాదని, తన సినీ ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరిదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఒక భావోద్వేగపూరిత నోట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

"దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా, గౌర‌వంగా ఉంది. ఈ గౌరవం నాది మాత్రమే కాదు, ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరిది. నా కుటుంబం, ప్రేక్షకులు, సహనటులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రేమ, నమ్మకం, ప్రోత్సాహమే నా అతిపెద్ద బలం. అవే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈ గుర్తింపును పూర్తి కృతజ్ఞతతో, నిండు హృదయంతో స్వీకరిస్తున్నాను" అని మోహన్‌లాల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.


More Telugu News