Bhumana Karunakar Reddy: దొంగను మేం పట్టుకుంటే... మాపైనే నిందలా?: పరకామణి ఘటనపై భూమన ఆగ్రహం

Bhumana Karunakar Reddy Fires Back at TDP Allegations in Parakamani Theft Case
  • పరకామణి ఘటనపై లోకేశ్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్న భూమన 
  • దొంగను పట్టుకుంది వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అని వెల్లడి
  • టీడీపీ హయాంలో దొరికితే ఆస్తులు వాళ్ల ఖాతాల్లోకి వెళ్లేవని విమర్శలు
  • రాజకీయ ప్రయోజనాలకు తిరుమలను వాడుకుంటున్నారని ఫైర్
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నారా లోకేశ్ పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని వివాదాల్లోకి లాగడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాస్తవాలను వదిలిపెట్టి, గత వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకే టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

శ్రీవారి హుండీ లెక్కింపు కేంద్రమైన పరకామణిలో అమెరికన్ డాలర్ల నోట్లను చోరీ చేస్తున్న సి.వి. రవికుమార్ అనే వ్యక్తిని 2023 ఏప్రిల్ 29న పట్టుకున్నది తమ ప్రభుత్వ హయాంలోనే అని భూమన గుర్తుచేశారు. అప్పటి విజిలెన్స్ సిబ్బంది ఆ నోట్ల విలువ రూ.72,000గా నిర్ధారించారని తెలిపారు. 

"దొంగతనాన్ని గుర్తించి, నిందితుడిని పట్టుకున్నది మేమే అయినప్పుడు, మాపైనే నిందలు వేయడం ఎంతవరకు సమంజసం?" అని ఆయన ప్రశ్నించారు. విచారణలో నిందితుడు రవికుమార్, తాను గత రెండు దశాబ్దాలుగా ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించాడని భూమన తెలిపారు. "అలాంటప్పుడు, గతంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఈ చోరీలను ఎందుకు అరికట్టలేకపోయింది? పెద్ద జీయంగార్ మఠంలో పనిచేస్తూ పరకామణి క్లర్కుగా వ్యవహరించిన రవికుమార్ అక్రమాలను ఎందుకు గుర్తించలేకపోయింది?" అని ఆయన నిలదీశారు.

ఈ కేసు విచారణ అత్యంత పారదర్శకంగా జరిగిందని భూమన వివరించారు. నిందితుడు తన తప్పును ఒప్పుకొని, ప్రాయశ్చిత్తంగా తన కుటుంబ ఆస్తులను స్వామివారికి కానుకగా ఇస్తానని ముందుకు వచ్చాడని తెలిపారు. ఈ క్రమంలోనే, సుమారు రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను రవికుమార్, అతని కుటుంబ సభ్యులు 2023 జూన్‌లో టీటీడీకి రిజిస్టర్ చేశారని పేర్కొన్నారు. టీటీడీ బోర్డు తీర్మానం అనంతరం, లోక్ అదాలత్ ద్వారా ఈ కేసు చట్టప్రకారం పరిష్కారమైందని స్పష్టం చేశారు. అత్యంత ధర్మబద్ధంగా సాగిన ఈ ప్రక్రియపై టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

"ఒకవేళ ఇదే నిందితుడు... చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పట్టుబడి ఉంటే, ఆ ఆస్తులు టీటీడీకి కాకుండా టీడీపీ నాయకుల ఖాతాల్లోకి వెళ్లేవి కాదా?" అని భూమన సంచలన ఆరోపణలు చేశారు. పంచాయితీలు చేసి ఆస్తులను పంచుకోవడం టీడీపీ నాయకులకు అలవాటేనని ఆయన విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్‌కు తిరుమల క్షేత్రాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. వారికి దేవుడంటే భయం, భక్తి లేవని ఈ ఘటనతో మరోసారి రుజువైందని ఆయన అన్నారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారని నిరూపించుకుంటున్నారని, ఆ ఏడుకొండలవాడే వారికి తగిన బుద్ధి చెబుతాడని భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Bhumana Karunakar Reddy
TTD
Tirumala
Parakamani
Chandrababu Naidu
Nara Lokesh
TDP
Theft
American dollars
YSRCP

More Telugu News