ఎందరు అడ్డుపడినా అతడే సరైనవాడు అని నమ్మాను... నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు: సీఎం చంద్రబాబు

  • మాచర్ల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం
  • మాచర్లలో హత్యా రాజకీయాలకు శాశ్వతంగా చరమగీతం పాడతామని వెల్లడి
  • కార్యకర్తల పోరాటాల వల్లే 20 ఏళ్ల తర్వాత చారిత్రక విజయం అని ఉద్ఘాటన
  • నియోజకవర్గ అభివృద్ధికి రూ. 50 కోట్ల నిధులు కేటాయింపు
పల్నాడు ప్రాంతంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న హత్యా రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలుకుతామని, ఇకపై ఇక్కడ రక్తం కాదు, అభివృద్ధి రూపంలో సాగు, తాగునీరు పారిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన మాచర్లలో శాంతిని నెలకొల్పి, అభివృద్ధి పథంలో నడిపించే పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ఆయన హామీ ఇచ్చారు. శనివారం మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఐదేళ్ల వైసీపీ పాలనలో మాచర్ల కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టాలు, చేసిన పోరాటాలను తాను ఎన్నటికీ మరవలేనని చంద్రబాబు భావోద్వేగంగా అన్నారు. వారి త్యాగాల పునాదుల మీదే 20 సంవత్సరాల తర్వాత మాచర్లలో తెలుగుదేశం జెండా రెపరెపలాడిందని కొనియాడారు. "రౌడీయిజాన్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగితే మాచర్ల ఎప్పటికీ మన అడ్డానే. గతంలో వైసీపీ అరాచకాలను అడ్డుకునే విషయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని, ఈసారి పక్కా వ్యూహంతో ముందుకెళ్లాం. అందుకే ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో జూలకంటి బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇచ్చాం. ఎందరో అడ్డుపడినా, ఆయనే సరైన అభ్యర్థి అని నమ్మాను. నా నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు" అని చంద్రబాబు తెలిపారు.

మాచర్ల నియోజకవర్గానికి ఒకవైపు దూకుడుగా ఉండే బ్రహ్మానందరెడ్డి, మరోవైపు సంయమనంతో రాజకీయం చేసే ఎంపీ లావు కృష్ణదేవరాయలు వంటి ఇద్దరు బలమైన నాయకులు దొరకడం అదృష్టమని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతానికి ఈ ఇద్దరి నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. "హత్యకు ప్రతీకారంగా మరో హత్య చేయడం మన విధానం కాదు. అలాంటి వారిని రాజకీయంగా సమాధి చేయాలి. భవిష్యత్తులో మాచర్లలో టీడీపీకి ఓటమి అనేదే లేకుండా చేయాలి" అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్‌ను రూపుమాపి, సాగునీరు, పరిశ్రమలు తీసుకురావడం వల్లే అక్కడి ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని అందించారని చంద్రబాబు గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో పల్నాడులో కూడా అభివృద్ధి రాజకీయాలకు శ్రీకారం చుడతామని ఉద్ఘాటించారు. మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం తక్షణమే రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దశాబ్దాల కల అయిన వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తామని, పల్నాడులో మిర్చి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తామని తెలిపారు.

కార్యకర్తల సంక్షేమానికి తమ పార్టీ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని, వారికి బీమా సౌకర్యం కల్పిస్తున్న ఏకైక పార్టీ టీడీపీయేనని చంద్రబాబు అన్నారు. "ఎన్నికల్లో ఇంటింటికీ వెళ్లి, ‘గ్యారెంటీ మాది’ అని హామీ ఇచ్చింది మీరే. మీ గౌరవాన్ని నిలబెట్టేలా ప్రతి హామీని అమలు చేస్తున్నాం. ఓట్లు వేయించే బాధ్యత మీది, మిమ్మల్ని గుర్తించి పదవులతో గౌరవించే బాధ్యత నాది" అని భరోసా ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక మేరకు చారిత్రక పల్నాటి వీరారాధన ఉత్సవాలను ఇకపై ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని, ఈ మేరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశానని వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులకు మాచర్లలో కాలం చెల్లిందని, ప్రజలకు చెడ్డపేరు తెచ్చే పనులను టీడీపీ కార్యకర్తలు ఎప్పటికీ చేయరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


More Telugu News