Sridhar Babu: హెచ్-1బీ వీసా రుసుం పెంచుతూ ట్రంప్ ఉత్తర్వులు.. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu Reacts to Trumps H1B Visa Fee Hike
  • భారతీయ టెక్ కంపెనీలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న మంత్రి
  • ట్రంప్ నిర్ణయంపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని నిలదీత
  • అమెరికా టెక్ కంపెనీలు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని వ్యాఖ్య
హెచ్-1బీ వీసా రుసుమును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెలువరించిన ఉత్తర్వులపై తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఈ ఉత్తర్వుల వల్ల భారతీయ టెక్ కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్ని టెక్ కంపెనీలకు నష్టం వాటిల్లేలా, మెరుగైన ఉద్యోగాలు పొందాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లేలా ట్రంప్ ఉత్తర్వులు ఉన్నాయని విమర్శించారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని ప్రశ్నించారు. అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రాలతో సంబంధాల విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలతో మోదీ వైఖరి సరిగా లేదని విమర్శించారు. అమెరికాలోని టెక్ కంపెనీలు కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు.

ట్రంప్ నిర్ణయంపై కేంద్రం నుంచి దౌత్య చర్యలు లేవని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై పెద్ద ఎత్తున ప్రభావం ఉందని అన్నారు. ట్రంప్ నిర్ణయంతో చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు ముూతపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్ తగ్గితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని అన్నారు. హెచ్-1బీ వీసా పొందుతున్న వారిలో టెక్ సంబంధిత ఉద్యోగులే అధికంగా ఉన్నారని వివరించారు. 
Sridhar Babu
H-1B Visa
Donald Trump
Indian Tech Companies
Telangana
US Relations
Remittance

More Telugu News