వందకోట్ల పరకామణి దోపిడీ దొంగ వెనుక వైసీపీ నేతలు: మంత్రి నారా లోకేశ్

  • తిరుమల పరకామణిలో వంద కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్న లోకేశ్
  • దొంగతనం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపణ
  • మాజీ సీఎం జగన్, భూమనపై లోకేశ్ ఫైర్
  • దోచిన సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపణ
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి పరకామణిలో వంద కోట్ల రూపాయలకు పైగా భారీ దొంగతనం జరిగిందని, దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని సహజ వనరులతో పాటు చివరకు భక్తులు పవిత్రంగా భావించే శ్రీవారి సొత్తును కూడా వదల్లేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది. అరాచకం పెచ్చరిల్లింది. జగన్... దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేరాఫ్ అడ్రస్ చేశారు. గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని దోచుకున్న జగన్ గ్యాంగ్... చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదలలేదు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారు. కోట్ల సొత్తు కొల్లగొట్టారు. ఈ డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. ఇందులో వాటాలను తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు అందాయని నిందితులే చెబుతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో నమ్మకంతో కట్టిన ముడుపులు, హుండీలో వేసిన కానుకలు వందల కోట్లు రవికుమార్ దోచుకుని వెళ్లినప్పుడు టీటీడీ చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి.. అతని మనుషులు ఏకంగా ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేయడానికి ప్రయత్నించారు. అధికారం అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు. భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూని కల్తీ చేశారు. అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. తిరుమల దర్శనాలను అమ్మేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు. 

ఏడుకొండల జోలికి వెళ్ళవద్దు, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దు అని.. నాడు జగన్మోహన్ రెడ్డికి బతిమాలి చెప్పారు చంద్రబాబు గారు... అయినా వినలేదు. ఏడుకొండలవాడు చాలా పవర్ ఫుల్ సామీ... ఆయనకు అపచారం తలపెట్టినా, ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా ఏం జరుగుతుందో తెలిసినప్పటికీ జగన్, భూమన ఏకంగా పరకామణినే దోచేశారు. గుడి, గుడిలో హుండీని దోచేసిన పాపాల గత పాలకుడు జగన్ గ్యాంగ్ పాపం పండింది. పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయి. రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారు" అంటూ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఈ మేరకు వీడియోను కూడా పంచుకున్నారు. 


More Telugu News