Axar Patel: పాక్‌తో పోరుకు ముందు టీమిండియాలో ఆందోళన.. అక్షర్ గాయంపై అనిశ్చితి

Will Axar Patel Return Vs Pakistan Major Injury Update From Indian Team
  • ఒమన్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ అక్షర్ పటేల్
  • నొప్పితో మైదానాన్ని వీడిన భారత ఆల్‌రౌండర్
  • రేప‌టి పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్‌కు అక్షర్ దూరం అయ్యే అవకాశం
  • అక్షర్ బాగానే ఉన్నాడన్న ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్
  • అక్షర్ ఆడకపోతే ముగ్గురు స్పిన్నర్ల వ్యూహం మార్చనున్న టీమిండియా
రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు భారత జట్టును ఓ ఆందోళన వెంటాడుతోంది. కీలక ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటమే దీనికి కారణం. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో పాకిస్థాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడా? లేదా? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.

ఒమన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మిడ్ ఆఫ్ నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి, వికెట్ కీపర్ హమ్మద్ మీర్జా కొట్టిన బంతిని క్యాచ్ ప‌ట్టే ప్రయత్నంలో అక్షర్ పటేల్ అదుపుతప్పాడు. క్యాచ్‌ను జారవిడిచి, తల నేరుగా నేలకు బలంగా తాకడంతో నొప్పితో విలవిలలాడాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి పరీక్షించగా అతని సహాయంతో అక్షర్ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు.

అయితే, మ్యాచ్ అనంతరం ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ మాట్లాడుతూ అక్షర్ బాగానే ఉన్నాడని స్పష్టం చేశాడు. అయినప్పటికీ, మ్యాచ్‌ల మధ్య కేవలం రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అతను పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతాడా? లేదా? అన్నది అనుమానంగానే ఉంది. ఒకవేళ అక్షర్ ఈ మ్యాచ్‌కు దూరమైతే టీమిండియా తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు దుబాయ్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌లలో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత్, ఈ ప్రణాళికను పక్కన పెట్టే అవకాశం ఉంది. స్టాండ్‌బై జాబితాలో ఉన్న స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలను పరిశీలించవచ్చు.

గాయపడటానికి ముందు ఒమన్‌తో మ్యాచ్‌లో అక్షర్ అద్భుతంగా రాణించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కేవలం 13 బంతుల్లోనే 26 పరుగులు చేసి జట్టు స్కోరు పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. సంజూ శాంసన్ (56)తో కలిసి నాలుగో వికెట్‌కు 45 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బౌలింగ్‌లో ఒక ఓవర్ వేసి నాలుగు పరుగులే ఇచ్చాడు.
Axar Patel
India vs Pakistan
Axar Patel injury
T20 World Cup
Washington Sundar
Sanju Samson
Oman cricket
Indian cricket team
cricket news
sports

More Telugu News