KTR: ప్రజల జేబులు కొట్టడానికే 'రోడ్ సేఫ్టీ సెస్': కేటీఆర్

KTR Slams Road Safety Cess as Burden on People
  • కొత్త వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ విధింపుపై కేటీఆర్ ఆగ్రహం
  • ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఇవ్వకుండా ప్రజలపై భారం మోపడం ఏంటని ఫైర్‌
  • వాహనాన్ని బట్టి రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు అదనపు వసూలు
  • గ్యారెంటీలను గాలికొదిలేసి పన్నులు వేస్తున్నారని తీవ్ర విమర్శ
  • ఇది పేద, మధ్యతరగతిని దగా చేయడమేనన్న మాజీ మంత్రి
తెలంగాణలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై 'రోడ్ సేఫ్టీ సెస్' పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది పేద, మధ్యతరగతి ప్రజలను దగా చేయడమేనని ఆయన మండిపడ్డారు. రహదారి ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి, ఆ భారాన్ని ప్రజలపైకి నెట్టడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి రహదారుల భద్రతా ప్రమాణాలను పెంచాల్సిన బాధ్యతను విస్మరించి, అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలని చూడటం దారుణమని కేటీఆర్ అన్నారు. కొత్తగా కొనే ప్రతి వాహనంపై రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు సెస్ వసూలు చేయాలన్న నిర్ణయం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘హైడ్రా’ వంటి తప్పుడు విధానాలతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి, ఇప్పుడు ఆ లోటును పూడ్చుకోవడానికే ఇలాంటి పన్నులు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇచ్చిన గ్యారెంటీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజల నుంచి రూ. 270 కోట్లు ముక్కుపిండి వసూలు చేసేందుకు కుట్ర పన్నుతోందని దుయ్యబట్టారు. కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని, అప్పు చేసి వాహనాలు కొనే సామాన్యుల జేబులు కొట్టే ఇలాంటి చర్యలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలు కాంగ్రెస్ సర్కారును క్షమించరని ఆయన హెచ్చరించారు.
KTR
K Taraka Rama Rao
Telangana
Road Safety Cess
BRS
Congress Government
Vehicle Tax
Road Accidents
Telangana Budget
HYDRA Scheme

More Telugu News