Benjamin Netanyahu: నెతన్యాహు మోసం చేశాడంటున్న ట్రంప్

Trump feels betrayed by Netanyahu over Qatar attack
  • ఖతార్ పై దాడి చేసిన ఇజ్రాయెల్
  • హమాస్ నేతలు తప్పించుకోగా... వారి బంధువుల మృతి
  • తనను నెతన్యాహు అవమానించాడన్న ట్రంప్
ఖతార్‌లోని దోహాపై ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడి అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలకు దారితీసింది. ఈ దాడి విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తనను మోసం చేశారని, దారుణంగా అవమానపరిచారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సన్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ దాడి అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీయగా, ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ తీరును తప్పుబట్టాయి.

దాడి జరిగిన వెంటనే, ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తన అనుమతి లేకుండానే ఇజ్రాయెల్ ఈ చర్యకు పాల్పడిందని ట్రంప్ ప్రకటించారు. అయితే, క్షిపణులు గాల్లోకి ఎగరడానికి ముందే ట్రంప్‌కు సమాచారం చేరవేశామని ఇజ్రాయెల్ వర్గాలు చెప్పినట్లు ఆక్సియోస్ మీడియా ప్రతినిధి పేర్కొనడం గమనార్హం. దాడి విషయం తెలిసేసరికి చాలా ఆలస్యమైందని, దానిని ఆపేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అమెరికా అధికారులు తెలిపారు.

వాస్తవానికి, హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల కోసం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడి సరికాదని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్, రక్షణ దళాలు (ఐడీఎఫ్) నెతన్యాహును హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఖతార్‌తో అమెరికాకు ఉన్న సత్సంబంధాలు దెబ్బతింటాయని వారించినా, వచ్చిన అవకాశాన్ని వదులుకోబోనని నెతన్యాహు మొండిగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ దాడిలో హమాస్ కీలక నేతలు తప్పించుకోగా, వారి బంధువులు, ఒక ఖతార్ నాయకుడు ప్రాణాలు కోల్పోయారు.

దాడి అనంతరం అమెరికా అధికారులు రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఖతార్ నాయకులతో చర్చలు జరపగా, ట్రంప్ స్వయంగా ఖతార్ ప్రధానితో మాట్లాడారు. ఖతార్ తమకు గొప్ప మిత్రుడని అభివర్ణించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగవని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, వచ్చే వారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తనను వైట్‌హౌస్‌కు ట్రంప్ ఆహ్వానించినట్లు నెతన్యాహు బుధవారం మీడియాకు తెలిపారు. సెప్టెంబర్ 9న దాడి జరిగిన తర్వాత ట్రంప్‌తో చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడానని ఆయన పేర్కొన్నారు. ఈ భేటీలో ఖతార్ దాడికి సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. 
Benjamin Netanyahu
Donald Trump
Israel
Qatar
Doha
Mossad
Hamas
US relations
Netanyahu Trump dispute
Israel Qatar attack

More Telugu News