Yasin Malik: బయటపడ్డ యాసిన్ మాలిక్ బండారం.. ప్రాణాల కోసం ఉగ్రవాదుల కాళ్లు పట్టుకున్న వైనం!

Yasin Malik Extremist begs for life from terrorists
  • యాసిన్ మాలిక్‌ను చంపేందుకు పాక్ ఐఎస్ఐ, లష్కరే ప్లాన్
  •  భారత ఏజెన్సీలతో పనిచేస్తున్నాడని బలమైన అనుమానం
  • ప్రాణభయంతో లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌ను వేడుకున్న మాలిక్
  • ఇకపై ఐఎస్ఐ చెప్పినట్టే నడుచుకుంటానని హామీ
  • సంచలన విషయాలు వెల్లడించిన భారత ఇంటెలిజెన్స్ వర్గాలు
  • ప్రస్తుతం టెర్రర్ ఫండింగ్ కేసులో తీహార్ జైలులో యాసిన్ మాలిక్
కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకప్పుడు తనను చంపాలని చూసిన పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్రవాదులనే ప్రాణభిక్ష కోరినట్లు ఉన్నతస్థాయి ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. భారత ఏజెన్సీలతో మాలిక్ రహస్యంగా పనిచేస్తున్నాడన్న అనుమానంతో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

2012లో యాసిన్ మాలిక్‌ను హతమార్చేందుకు ఐఎస్ఐ, లష్కరే తోయిబా సంస్థలు సంయుక్తంగా ఒక కుట్ర పన్నాయి. ఈ బాధ్యతను సోపోర్‌కు చెందిన లష్కరే ఉగ్రవాది హిలాల్ దార్‌కు అప్పగించాయి. ఐఎస్ఐ ఆదేశాల మేరకు, శ్రీనగర్‌లోని మైసుమా ప్రాంతంలో ఉన్న మాలిక్ నివాసం ‘మక్బూల్ మంజిల్’ వద్ద దార్ వీడియో నిఘా కూడా నిర్వహించాడు.

అయితే, జమ్మూ కశ్మీర్ పోలీసులు అందించిన పక్కా సమాచారంతో 2012 చివర్లో హిలాల్ దార్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో అతను అసలు విషయం బయటపెట్టాడు. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో కోసం మాలిక్ పనిచేస్తున్నట్లు తేలడంతో అతడిని అంతమొందించాలని ఐఎస్ఐ, లష్కరే నిర్ణయించినట్లు దార్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

ఈ పరిణామాల తర్వాత 2013లో కీలక మలుపు చోటుచేసుకుంది. పార్లమెంట్ దాడి కేసులో అఫ్జల్ గురును భారత్ ఉరితీయడంతో, ఆ సమయంలో పాకిస్థాన్‌లో ఉన్న యాసిన్ మాలిక్ దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాడు. ఈ నిరసనల్లో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కూడా పాల్గొన్నాడు. ఇదే అదనుగా మాలిక్, హఫీజ్ సయీద్‌తో రహస్యంగా సమావేశమై తనను క్షమించాలని వేడుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో భారత ఏజెన్సీలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోనని, పూర్తిగా ఐఎస్ఐ ఆదేశాల మేరకే నడుచుకుంటానని హామీ ఇచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడు.

ఆ తర్వాత పాకిస్థాన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మాలిక్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది. అతడి భార్య, పాకిస్థానీ జాతీయురాలైన ముషాల్ మాలిక్‌కు వీసా నిరాకరించింది. అనంతరం, మాలిక్.. సయ్యద్ అలీ షా గిలానీ, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్‌లతో కలిసి జాయింట్ రెసిస్టెన్స్ లీడర్‌షిప్ (జేఆర్ఎల్) అనే వేర్పాటువాద కూటమిని ఏర్పాటు చేశాడు. ఈ కూటమి ఆధ్వర్యంలో కశ్మీర్‌లో ఏళ్లపాటు బంద్‌లు, రాళ్లదాడులు, పాఠశాలలపై దాడులు వంటి హింసాత్మక ఘటనలకు ఆజ్యం పోశాడు.

2017లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) టెర్రర్ ఫండింగ్ కేసులపై ఉక్కుపాదం మోపింది. 2019లో జేకేఎల్ఎఫ్‌ను నిషేధించి, యాసిన్ మాలిక్‌ను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి అతను టెర్రర్ ఫండింగ్ ఆరోపణలపై ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ తాజా వెల్లడితో కశ్మీర్ వేర్పాటువాదం వెనుక ఉన్న పాక్ జోక్యం, నాయకుల ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది.
Yasin Malik
Kashmir
ISI
Lashkar-e-Taiba
Terror Funding
Hafiz Saeed
Separatist
JRL
NIA
Afzal Guru

More Telugu News