Kadiyam Srihari: నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకరే తేలుస్తారు: కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kadiyam Srihari says Speaker will decide my party
  • విలేకరులు అడిగిన ప్రశ్నకు కడియం శ్రీహరి సమాధానం
  • సుప్రీం కోర్టు తీర్పుపై స్పీకర్ తమకు నోటీసులు ఇచ్చారన్న కడియం
  • తాను సమాధానం ఇచ్చాక తన పార్టీ ఏదో స్పీకర్ తేలుస్తారని వ్యాఖ్య
  • కేసీఆర్ గతంలో 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని రాజీనామా చేయించలేదని విమర్శ
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నానో అసెంబ్లీ స్పీకర్ చెప్పాలని వ్యాఖ్యానించారు. హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక విలేకరి "మీరు ఏ పార్టీలో ఉన్నారు?" అని ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు.

కడియం మాట్లాడుతూ, "ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదు. మేం పార్టీ ఫిరాయించామని సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ తీర్పు వచ్చింది. ప్రస్తుతం ఆ తీర్పు స్పీకర్ పరిధిలో ఉంది. వారే దీనిపై నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ తమకు నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులకు సమాధానం చెప్పిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఈ అంశం స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను పార్టీ గురించి మాట్లాడటం లేదు, ఫిరాయింపుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అయితే నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ తేల్చాలి" అని అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళుతున్నామని చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గంలోని చెరువుల పూడిక తీసి మరమ్మతులు చేసి సాగునీరు అందించినట్లు ఆయన వెల్లడించారు.

రేవంత్ రెడ్డి సహకారం వల్లే అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ ప్రజలతోనే ఉంటానని, ప్రజల కోసం పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని, అలా చేర్చుకున్న వారిలో ఇద్దరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. అప్పుడు బీఆర్ఎస్‌లో చేరిన వారు ఎవరూ రాజీనామా చేయలేదని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ అగ్రనేతలకు ఇప్పుడు విలువలు గుర్తుకు వచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు.
Kadiyam Srihari
Station Ghanpur
Telangana politics
Assembly speaker
Party defection
Revanth Reddy

More Telugu News