Nara Lokesh: ఏపీలో మారిన దసరా సెలవుల తేదీలు.. మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

AP Dasara Holidays to Begin September 22nd Says Nara Lokesh
  • ఈ నెల‌ 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు
  • ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం
  • రెండు రోజుల ముందుగానే ప్రారంభం కానున్న సెలవులు  
  • ఎక్స్ వేదిక‌గా మంత్రి నారా లోకేశ్ ప్ర‌క‌ట‌న‌
ఏపీలోని పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దసరా సెలవుల తేదీలలో మార్పు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే, అంటే ఈ నెల‌ 22 నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉపాధ్యాయుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ విషయాన్ని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన వెల్లడించారు. "పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం" అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

వాస్తవానికి, విద్యాశాఖ ముందుగా జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల‌ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉన్నాయి. అయితే, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అదనంగా రెండు రోజులు సెలవులు లభించనున్నాయి. అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Nara Lokesh
AP Dasara holidays
Andhra Pradesh schools
Dasara holidays 2024
AP education department
School holidays AP
AP government
Teachers request
Academic calendar
AP school news

More Telugu News