Door Less Village: ఆ ఊళ్లో ఇళ్లకు తలుపులు ఉండవు... అయినా ఒక్క దొంగతనం జరగదు!

Odishas Sialia Village Where Homes Have No Doors
  • ఒడిశాలోని సియాలియా గ్రామంలో ఇళ్లకు తలుపులు ఉండవు
  • గ్రామదేవత ఖరాఖైదేవి తమను కాపాడుతుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం
  • ఇప్పటివరకు ఒక్క దొంగతనం కూడా జరగలేదని చెప్పిన పోలీసులు
  • అమ్మవారి ఆలయంలోని గర్భగుడికి కూడా పైకప్పు ఉండదు
  • గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వానికి వినతి
సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ఇంటికి గ‌ట్టి తాళాలు వేసి వెళ్తాం. కానీ ఒడిశాలో ఓ వింత గ్రామం ఉంది. ఆ ఊరిలోని ఏ ఇంటికీ తలుపులు గానీ, ద్వారబంధాలు గానీ కనిపించవు. అయినా అక్కడ ఇప్పటివరకు ఒక్క దొంగతనం కూడా జరగలేదు. ఈ ఆసక్తికరమైన గ్రామం ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో ఉన్న సియాలియా. ఇక్కడి ప్రజలు తమ ఇళ్లకు ఎప్పుడూ తలుపులు బిగించరు.

సియాలియా గ్రామంలోని ఏ ఇంట్లోనూ, పడకగది, వంటగది సహా ఏ గదికీ తలుపులు ఉండవు. వాటికి బదులుగా కేవలం చెక్క ఫ్రేములు లేదా పరదాలు మాత్రమే అడ్డుగా వేసుకుంటారు. తమ గ్రామ దేవత అయిన ఖరాఖైదేవి తమను, తమ ఆస్తులను ఎల్లప్పుడూ కాపాడుతుందని గ్రామస్థులు బలంగా విశ్వసిస్తారు. ఆ నమ్మకంతోనే తరతరాలుగా తలుపులు లేని ఇళ్లలోనే నివసిస్తున్నారు. ఊరికి ఉత్తరాన ఉన్న ఖరాఖైదేవి ఆలయంలోని గర్భగుడికి పైకప్పు లేకపోవడం మరో విశేషం. అమ్మవారికి సూర్యరశ్మి ఇష్టం కాబట్టే అలా పైకప్పు లేకుండా ఉంచామని స్థానికులు చెబుతున్నారు.

గ్రామస్థుల నమ్మకానికి తగ్గట్టే, సియాలియాలో ఇప్పటివరకు ఒక్క చోరీ కేసు కూడా నమోదు కాలేదని స్థానిక పోలీసులు సైతం ధ్రువీకరించారు. తమ గ్రామ ప్రత్యేకతను గుర్తించి, దీనిని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు పర్యాటక శాఖకు ఒక లేఖ కూడా రాశారు. గ్రామస్థుల వినతిని ప్రభుత్వానికి పంపామని జిల్లా పర్యాటక అధికారి తెలిపారు.
Door Less Village
Sialia village
Odisha village
No doors village
Theft free village
Kharakhai Devi
Kendrapara district
Unique village Odisha
Odisha tourism
Indian villages
Customs traditions India

More Telugu News