Komatireddy Raj Gopal Reddy: జగన్‌ను కలవడానికి రాలేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Raj Gopal Reddy Denies Meeting Jagan
  • గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి
  • దివంగత వైఎస్సార్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడి
  • వైఎస్సార్ కుటుంబంపై ఇప్పటికీ తమకు అభిమానం ఉందని వ్యాఖ్య
  • తన ప్రతి కదలికపైనా చర్చ జరగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు
  • డబ్బు ఉండి దానం చేయని వారు తన దృష్టిలో నేరస్తులని వ్యాఖ్య
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని స్ఫూర్తిగా తీసుకునే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆయన కుటుంబంపై తమకు ఇప్పటికీ ఎంతో అభిమానం ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గుంటూరులో ఉడుముల సాంబిరెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థినుల స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... తన మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు గుంటూరుకు వచ్చానని, అయితే ఈ పర్యటనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. "నేను ఏపీకి వస్తున్నానని తెలియగానే జగన్‌ను కలవడానికేనని ప్రచారం మొదలుపెట్టారు. నేను వెంటనే మీడియా ముందు ఆ ప్రచారాన్ని ఖండించాను. నా ప్రతి కదలికపైనా, ప్రతి మాటపైనా చర్చ జరుగుతోంది" అని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. "ఒకప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వైఎస్సార్ శిష్యులు అనేవారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. వైఎస్సార్ చనిపోయినప్పుడు కన్నీరు పెట్టని కుటుంబం లేదు" అని రాజగోపాల్ రెడ్డి భావోద్వేగంగా ప్రసంగించారు.

అనంతరం తన సామాజిక సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ, "డబ్బు ఉండి కూడా దానం చేయని వారు నా దృష్టిలో నేరస్తులతో సమానం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మా అమ్మ చెప్పిన మాట ప్రకారం 'కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్' నెలకొల్పి, దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. జనగామలో రూ. 15 కోట్లతో మహిళల కోసం అనాథాశ్రమం నిర్మించాను" అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయన భారీ కాన్వాయ్‌తో హాజరయ్యారు. కాగా, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
Komatireddy Raj Gopal Reddy
YS Rajasekhara Reddy
Munugode MLA
Andhra Pradesh Politics
Guntur
YS family
Komati Reddy Brothers
Revanth Reddy
Telangana Politics
Udumula Sambi Reddy

More Telugu News