Nara Lokesh: అసెంబ్లీ మార్ష‌ల్స్‌పై మంత్రి లోకేశ్ ఫైర్.. ఇంకా తాడేపల్లి ప్యాలెస్ అనుకుంటున్నారా?

Nara Lokesh Fires on Assembly Marshals in AP Assembly
  • అసెంబ్లీ లాబీలో మార్షల్స్ తీరుపై మంత్రి లోకేశ్ ఆగ్రహం
  • ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో మార్షల్ దురుసు ప్రవర్తన
  • మీడియాతో మాట్లాడుతుండగా నెట్టేసే ప్రయత్నం
  • ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నారా? అంటూ లోకేశ్ ఫైర్
  • ఎమ్మెల్యేల జోలికి రావొద్దని సిబ్బందికి స్ట్రాంగ్ వార్నింగ్
ఏపీ శాసనసభలో భద్రతా సిబ్బంది తీరుపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో ఓ మార్షల్ దురుసుగా ప్రవర్తించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. "ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలోనే ఉన్నామనుకుంటున్నారా?" అంటూ సిబ్బందికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.. గురువారం అసెంబ్లీ లాబీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి లోకేశ్ ఛాంబర్ వెలుపల టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ మార్షల్, లాబీలో ఎవరూ ఉండకూడదని, వెంటనే వెళ్లిపోవాలని గట్టిగా చెప్పారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే నరేంద్రపై చేయి వేసి, అక్కడి నుంచి పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు.

మార్షల్ ప్రవర్తనతో ఎమ్మెల్యే నరేంద్ర తీవ్ర అసహనానికి గురై ఆయనపై మండిపడ్డారు. అదే సమయంలో తన ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన మంత్రి లోకేశ్ ఈ ఘటనను గమనించారు. వెంటనే జోక్యం చేసుకుని మార్షల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని అని నిలదీశారు.

"ఎమ్మెల్యేల విషయంలో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? పాసులు లేని వ్యక్తులు లోపలికి రాకుండా చూడటమే మీ పని. అంతేకానీ సభ్యుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు" అని లోకేశ్ సిబ్బందికి స్పష్టం చేశారు. విధులకు సంబంధించి హద్దులు మీరి ప్రవర్తిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. 
Nara Lokesh
Andhra Pradesh Assembly
AP Assembly
Dhulipalla Narendra
TDP MLA
Tadepalli Palace
Assembly Marshals
Political News Andhra Pradesh
Andhra Pradesh Politics

More Telugu News