KT Rama Rao: కేటీఆర్ ఒక చవట: మేడిపల్లి సత్యం తీవ్ర వ్యాఖ్యలు

Medipalli Satyam Slams KTR as Useless Fellow
  • బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర విమర్శలు
  • చెల్లెలి మాటలకే సమాధానం చెప్పలేని చవట దద్దమ్మ అంటూ ఘాటు వ్యాఖ్యలు
  • ఎల్ అండ్ టీని బెదిరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపణ
  • జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపుపై కేటీఆర్‌కు బహిరంగ సవాల్
  • ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు 50 వేల మెజార్టీ ఖాయమని ధీమా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత చెల్లెలు కవిత మాటలకే జవాబు చెప్పలేని కేటీఆర్ ఒక 'చవట దద్దమ్మ' అంటూ ఘాటుగా విమర్శించారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ రాష్ట్రానికి పట్టిన శని అని, ఆయన నోటి నుంచి అపశకునం మాటలు తప్ప మంచి రాదని అన్నారు.

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కేటీఆర్ చూస్తున్నారని మేడిపల్లి సత్యం ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరిగితే తన రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందన్న భయంతోనే కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాము రాజకీయ విమర్శలను స్వాగతిస్తామని, కానీ కేటీఆర్ చేస్తున్నవి నీచమైన ఆరోపణలని అన్నారు. ఆయన చెప్పే పాత కబుర్లను ప్రజలు ఇకపై నమ్మరని స్పష్టం చేశారు.

హైదరాబాద్ మెట్రో విషయంలో ఎల్ అండ్ టీ సంస్థను తాము బెదిరించామని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సత్యం అన్నారు. "ఈ మాట మీకు ఎల్ అండ్ టీ ప్రతినిధులు ఎవరైనా చెప్పారా?" అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. గతంలో బేగంబజార్ మీదుగా మెట్రో లైన్ వెళ్లకుండా అడ్డుపడింది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని నిలదీశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యాపారవేత్తలు, ఉద్యమకారులతో సహా అందరినీ బెదిరించి బతికింది ఎవరో ప్రజలందరికీ తెలుసని ఆరోపించారు.

రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను సత్యం తప్పుబట్టారు. "దమ్ముంటే జూబ్లీహిల్స్ గెలుపుపై సవాల్ స్వీకరించాలి. ఆ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలోనే బీఆర్ఎస్ కథ ముగిసింది" అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కనీసం 50 వేల ఓట్ల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీలు సైతం రేవంత్ రెడ్డి అందిస్తున్న 'అచ్చా చావల్' పథకాన్ని మెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో సంతోషంగా లేనిది కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. 
KT Rama Rao
BRS
Medipalli Satyam
Telangana Politics
Congress
Jubilee Hills
Revanth Reddy
Hyderabad Metro
L&T
Kavitha

More Telugu News