Air Corsica: విధుల్లో కంట్రోలర్ గాఢ నిద్ర.. గాల్లోనే 18 నిమిషాలు చక్కర్లు కొట్టిన విమానం!

Air Corsica Flight circles mid air after controller sleeps
  • ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నిద్రపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం
  • పారిస్ నుంచి కార్సికా వస్తున్న ఎయిర్ కార్సికా ఫ్లైట్‌
  • సుమారు 18 నిమిషాల పాటు ఆకాశంలోనే తిరిగిన ప్రయాణికుల విమానం
  • రన్‌వే లైట్లు ఆన్ కాకపోవడంతో అనుమానంతో పైలట్ అప్రమత్తం
  • టవర్‌పైకి ఎక్కి కంట్రోలర్‌ను నిద్రలేపిన సిబ్బంది, పోలీసులు
  • సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
పారిస్‌లోని ఓర్లీ విమానాశ్రయం నుంచి కార్సికాలోని అజాక్సియోకు బయలుదేరిన ఎయిర్ కార్సికా విమానానికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. విమానం ల్యాండ్ కావాల్సిన సమయానికి... అజాక్సియో విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విధుల్లో ఉండగానే నిద్రపోయారు. దీనితో పైలట్‌కు ల్యాండింగ్‌కు సంబంధించిన సూచనలు అందలేదు.

రన్‌వేపై లైట్లు వెలగకపోవడంతో అనుమానం వచ్చిన పైలట్, విమానాన్ని దించకుండా గాల్లోనే తిప్పడం మొదలుపెట్టారు. దాదాపు 18 నిమిషాల పాటు విమానం మధ్యధరా సముద్రంపైనే చక్కర్లు కొడుతూ ఉంది. మరోవైపు, విమానాశ్రయంలోని అగ్నిమాపక సిబ్బంది కంట్రోల్ టవర్‌ను సంప్రదించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. వారికి ఎటువంటి స్పందన రాకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

చివరకు విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు కలిసి టవర్‌పైకి వెళ్లి నిద్రిస్తున్న కంట్రోలర్‌ను మేల్కొలిపారు. ఆ తరువాత ఆయన రన్‌వే లైట్లను వెలిగించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయించారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పందిస్తూ, విమానం రావాలసిన సమయం కంటే గంట ఆలస్యమైందని, ఆ సమయంలో టవర్‌లో ఆ ఉద్యోగి ఒక్కరే విధుల్లో ఉన్నారని, ఈ క్రమంలోనే ఆయన నిద్రలోకి జారుకున్నారని వివరించింది. విమానాన్ని బాస్టియా నగరానికి మళ్లించాలని భావిస్తున్న సమయంలో సమస్య పరిష్కారం కావడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Air Corsica
Orly Airport
Ajaccio Airport
Air traffic controller
France civil aviation authority
Flight delayed

More Telugu News