Revanth Reddy: రేవంత్ రెడ్డితో బ్రిటన్ హైకమిషనర్ భేటీ.. తెలంగాణ విద్యార్థులకు యూకే స్కాలర్‌షిప్స్‌కు అంగీకారం

Revanth Reddy meets British High Commissioner UK Scholarships for Telangana Students
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భారత బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ భేటీ
  • తెలంగాణ విద్యార్థులకు చెవెనింగ్ స్కాలర్‌షిప్స్‌కు బ్రిటన్ అంగీకారం
  • రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు సుముఖత
  • మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఆహ్వానం
  • వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరిన ముఖ్యమంత్రి
  • ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన బ్రిటీష్ హైకమిషనర్
తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. యూకే ప్రభుత్వం అందించే 'చెవెనింగ్ స్కాలర్‌షిప్స్‌'ను రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేయడానికి బ్రిటన్ అంగీకారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో భారత బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ ఈ హామీ ఇచ్చారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. కో-ఫండింగ్ ప్రాతిపదికన ఈ స్కాలర్‌షిప్స్‌లను అందించడానికి ఆమె సుముఖత వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో విద్య, అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ప్రభుత్వం తీసుకురానున్న నూతన విద్యా విధానం ముసాయిదాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటీష్ హైకమిషనర్‌కు వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్ల నైపుణ్యాలను మెరుగుపరిచడానికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. దీనికి లిండీ కామెరాన్ సానుకూలంగా స్పందించారు.

అనంతరం, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో బ్రిటీష్ కంపెనీలు భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు. దీంతోపాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ), ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టేడానికి ముందుకు రావాలని కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనలన్నింటికి బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంతో తెలంగాణ-బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు.
Revanth Reddy
Telangana
UK scholarships
Chevening Scholarships
Lindy Cameron
British High Commissioner

More Telugu News