AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ లోకి ఈడీ ఎంట్రీ... 5 రాష్ట్రాల్లో సోదాలు

AP Liquor Scam ED Enters Conducts Raids in 5 States
  • ఏపీ, తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో విస్తృత సోదాలు
  • మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు
  • నిందితుల సంస్థలు, కార్యాలయాలే లక్ష్యంగా దాడులు
ఏపీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. ఏపీ, తెలంగాణ సహా మొత్తం ఐదు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తుండటం కలకలం రేపుతోంది.

ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న నిందితుల సంస్థలు, వారి కార్యాలయాలే లక్ష్యంగా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లోని దాదాపు 20 ప్రదేశాలలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ ఈ కేసును సుమోటోగా స్వీకరించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ కేసును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారిస్తున్న విషయం తెలిసిందే. సిట్ ఇప్పటివరకు ఈ కేసులో 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా గుర్తించింది. వీరిలో 12 మందిని అరెస్టు చేయగా, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మిథున్ రెడ్డి, వెంకటేశ్‌ నాయుడు సహా మిగిలిన 8 మంది నిందితులు ఇంకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.

సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే, ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 
AP Liquor Scam
Andhra Pradesh Liquor Scam
ED Raids
Enforcement Directorate
Excise Scam
Liquor Gate
Money Laundering
Special Investigation Team SIT

More Telugu News