K Narayana: కేసీఆర్, జగన్ వ్యవహారం.. పెళ్లి చేసుకుని కాపురం చేయనన్నట్టు ఉంది: సీపీఐ నారాయణ చురక

K Narayana Criticizes KCR and Jagan for Assembly Absence
  • అసెంబ్లీకి వెళ్లరు కానీ జీతాలు తీసుకుంటారని నారాయణ మండిపాటు
  • సాయుధ పోరాటానికి మావోయుస్టుల విరామంపై హర్షం
  • దీన్ని మోదీ, అమిత్ షా తమ విజయంగా చెప్పుకుంటున్నారని విమర్శ
శాసనసభ్యులుగా ప్రమాణం చేసి, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని కేసీఆర్, జగన్‌ల తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారి వ్యవహారం ‘పెళ్లి చేసుకుని కాపురం చేయనన్నట్టు’ ఉందని ఎద్దేవా చేశారు. గుంటూరు, సత్తెనపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యేలుగా రాయితీలు, జీతభత్యాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా అనేది కొన్ని నిబంధనల ప్రకారమే లభిస్తుందని, అందుకు అనుగుణంగానే వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన గుర్తుచేశారు.

మరోపక్క, సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు మావోయిస్టులు తీసుకున్న నిర్ణయాన్ని నారాయణ స్వాగతించారు. అయితే, శాంతి చర్చల కోసం వారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తమ విజయంగా ప్రచారం చేసుకోవడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. స్పష్టమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ సిద్ధాంతాలు కలిగిన నక్సలైట్లను టెర్రరిస్టులతో పోల్చుతూ ప్రధాని మోదీ, అమిత్ షా మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

గిరిజనులను భయపెట్టి, సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని నారాయణ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీసీలకు రాజ్యాంగబద్ధంగా 42 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ లక్ష్య సాధన కోసం సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21 నుంచి 25 వరకు ఛండీగఢ్‌లో జరగనున్న పార్టీ జాతీయ మహాసభల్లో అనేక కీలక అంశాలపై చర్చిస్తామని నారాయణ తెలిపారు. 

K Narayana
KCR
Jagan
CPI Narayana
AP Assembly
Telangana Assembly
Maoists
Naxalites
BC Reservations
Chandigarh CPI National Congress

More Telugu News