Pennsylvania Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు పోలీసుల మృతి

Three Police Officers Killed in Pennsylvania Shooting
  • అమెరికాలోని పెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం
  • విధి నిర్వహణలో ముగ్గురు పోలీసు అధికారుల మృతి
  • మరో ఇద్దరు ఆఫీసర్లకు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
  • ఎదురుకాల్పుల్లో కాల్పుల్లో నిందితుడి హతం
  • గృహ హింస కేసు విచారణ సందర్భంగా ఈ ఘటన
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఒక దారుణ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. గృహ హింసకు సంబంధించిన ఒక కేసు విచారణ కోసం వెళ్లిన వారిపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు కూడా హతమయ్యాడని అధికారులు తెలిపారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, పెన్సిల్వేనియాలోని కొడొరస్ టౌన్‌షిప్‌లో బుధవారం మధ్యాహ్నం ఈ విషాదం చోటుచేసుకుంది. ఒక రోజు క్రితం ప్రారంభమైన కేసు విచారణలో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లారని స్టేట్ పోలీస్ కమిషనర్ క్రిస్టోఫర్ పారిస్ తెలిపారు. "ఇది గృహ హింసకు సంబంధించిన కేసు. విచారణలో భాగంగా వెళ్లిన అధికారులపై దాడి జరిగింది" అని ఆయన మీడియాకు వివరించారు. అయితే, కేసు తాలూకు ఇతర వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

ఈ ఘటనపై పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన ఇద్దరు అధికారుల పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన తెలిపారు. "ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం సేవ చేసిన ముగ్గురు అమూల్యమైన ప్రాణాలను కోల్పోయాం" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ దాడిని సమాజానికి పట్టిన చీడగా అటార్నీ జనరల్ పమేలా బోండి అభివర్ణించారు. స్థానిక అధికారుల దర్యాప్తులో ఫెడరల్ ఏజెంట్లు కూడా సహాయం అందిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. కాల్పుల నేపథ్యంలో సమీపంలోని ఒక పాఠశాలలో అధికారులు కొద్దిసేపు షెల్టర్-ఇన్-ప్లేస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని తరువాత స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన విచారణ కొనసాగుతోంది. మరణించిన అధికారులు, నిందితుడి వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు.
Pennsylvania Shooting
US shooting
police officers killed
Pennsylvania
domestic violence case
gun violence
York County Pennsylvania
governor Josh Shapiro

More Telugu News