KTR: జనంలోకి ఎప్పుడు రావాలో కేసీఆర్‌కు తెలుసు: కేటీఆర్

KTR Comments on KCRs Public Appearance Revanth Reddys Governance
  • సరైన సమయంలో జనంలోకి వస్తారన్న కేటీఆర్
  • ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శ
  • పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకల్లా తయారయిందని వ్యాఖ్య
ప్రజల్లోకి ఎప్పుడు రావాలో కేసీఆర్‌కు తెలుసని, సరైన సమయంలో ఆయన ప్రజల్లోకి వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులు సమావేశం కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కోపంతో సిరిసిల్ల నేతన్నల పొట్ట కొట్టారని, చేనేత పరిశ్రమను అతలాకుతలం చేశారని ఆయన ఆరోపించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకల్లా ఉందని కేటీఆర్ అభివర్ణించారు. పాలన అద్భుతంగా ఉందనుకుంటే వెంటనే ఉపఎన్నికలు పెట్టాలని, అప్పుడు ఎవరేమిటో తేలిపోతుందని సవాల్ విసిరారు. ఉద్యోగాల కోసం డబ్బులు అడిగారని అభ్యర్థులే చెబుతున్నారని అన్నారు. సమాధానం చెప్పాల్సింది పోయి తమపైకి ఉసిగొల్పితే ఎలాగని ప్రశ్నించారు. మంత్రులకు తెలియకుండానే ముఖ్యమంత్రి కాళేశ్వరం కేసును సీబీఐకి ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు.

దీనిని బట్టి కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎంత మంచి అవగాహన ఉందో తెలుస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో బంధుప్రీతి లేదని అంటున్నారని, అలాంటప్పుడు సుజన్ రెడ్డి, అమిత్ రెడ్డికి వందల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు వచ్చేదాకా అజారుద్దీన్ ఎమ్మెల్సీ కాలేరని అన్నారు. అజారుద్దీన్ క్రికెట్‌లో బాగా కట్‌లు కొట్టేవారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకే పెద్ద కట్ కొట్టిందని వ్యాఖ్యానించారు. ఆయన ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఏడు సర్వేలు చేయించామని, ఆ సర్వేలన్నింటిలోనూ బీఆర్ఎస్ గెలుస్తుందని తేలిందని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ చేపట్టిన మూడు సర్వేల్లోనూ తామే గెలుస్తామని వచ్చిందని ఆయన అన్నారు. ఆర్ఆర్ఆర్ విషయంలో భారీ కుంభకోణం జరుగుతోందని, ముఖ్యమంత్రి బంధువుల కోసం దక్షిణ భాగం అలైన్‌మెంట్ మారుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణంపై త్వరలో అన్ని వివరాలు బయటపెడతామని ఆయన తెలిపారు.
KTR
K Taraka Rama Rao
BRS
Revanth Reddy
Telangana politics
Group 1 exams

More Telugu News