పెరమన వద్ద రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికరం: పవన్ కల్యాణ్

  • నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 
  • చిన్నారితో సహా ఏడుగురు దుర్మరణం
  • పవన్ తీవ్ర ఆవేదన
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తున్న టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉండటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దుర్ఘటనపై ఆయన బుధవారం ఓ ప్రకటన ద్వారా స్పందించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు తనకు వివరించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. రాష్ట్రంలో ఇసుక, కంకర రవాణా చేసే వాహనాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

"ఇసుక, కంకర తరలించే వాహనాలు మితిమీరిన వేగంతో, రాంగ్ రూట్లలో వెళుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వాహనాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన సూచించారు.


More Telugu News