Pawan Kalyan: దుర్గ‌మ్మ గుడి మెట్లు కింద‌నుంచి పైకి క‌డిగిన మ‌న పిఠాపురం పీఠాధిప‌తి నోరు మెద‌ప‌డం లేదు: యాంకర్ శ్యామల

Anchor Shyamala Criticizes Pawan Kalyan on Tirumala Issues
  • తిరుమల వివాదాలపై పవన్ కల్యాణ్ మౌనంగా ఉన్నారంటూ శ్యామల ఆగ్రహం
  • ప్రశ్నించినందుకే భూమన కరుణాకర్‌రెడ్డిపై అక్రమ కేసు అని ఆరోపణ
  • కూటమి ప్రభుత్వం వచ్చాకే తిరుమలలో అపచారాలు పెరిగాయన్న విమర్శ
  • గోవుల మృతి, కొండపై మాంసం వంటి ఘటనల ప్రస్తావన
తిరుమలలో వరుసగా అపచారాలు చోటుచేసుకుంటున్నప్పటికీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మౌనంగా ఉన్నారంటూ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రంగా విమర్శించారు. గతంలో విజయవాడ దుర్గమ్మ గుడి మెట్లు కింద నుంచి పైకి కడిగిన పవన్, ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న అపచారాలపై ఎందుకు స్పందించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు.

అలిపిరి వద్ద అపరిశుభ్రమైన ప్రదేశంలో, మద్యం సీసాలు ఉన్న చోట స్వామివారి విగ్రహాన్ని పడేయడాన్ని చూసి ప్రశ్నించినందుకే టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని శ్యామల ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడమే చంద్రబాబు ప్రభుత్వ నైజమా అని ఆమె మండిపడ్డారు. ఇలాంటి కేసులకు వైసీపీ నేతలు భయపడరని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమలలో ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉందని శ్యామల అన్నారు. కల్తీ నెయ్యి అంటూ లడ్డూపై అబద్ధపు ప్రచారం చేశారని, గోవులు మరణించడం, కొండపై మాంసాహారం దొరకడం వంటివి జరిగాయని గుర్తుచేశారు. తాజాగా, సన్నిధి గొల్ల తీయాల్సిన ఆలయ ద్వారాలను ఓ మీడియా వ్యక్తి తెరవడం కూడా పెద్ద తప్పిదమని ఆమె పేర్కొన్నారు.

గతంలో "సనాతన ధర్మ పరిరక్షకుడిని" అంటూ కాషాయ వస్త్రాలు ధరించి దుర్గమ్మ గుడి మెట్లను శుభ్రం చేశారని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి శ్యామల వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఆయన ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె నిలదీశారు.
Pawan Kalyan
Tirumala
Anchor Shyamala
YSCRP
TTD
Durga Temple
Andhra Pradesh Politics
Hinduism
Bhumana Karunakar Reddy
TDP

More Telugu News