Nara Lokesh: ఏపీ వేగంగా అభివృద్ది చెందడానికి మూడు ప్రధాన కారణాలు ఇవే!: లండన్ లో నారా లోకేశ్

Nara Lokesh Highlights Key Factors for AP Development in London
  • గడిచిన 15 నెలల్లోనే ఏపీకి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు
  • చంద్రబాబు వల్లే ఇది సాధ్యమైందని వెల్లడి 
  • క్వాంటమ్ వ్యాలీ, డేటా సిటీలతో రాష్ట్ర రూపురేఖల మార్పు ఖాయం
  • ఏఐ అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశాలు
  • పరిశ్రమల ఏర్పాటుకు అవరోధంగా ఉన్న నిబంధనల సరళీకరణ
  • విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు-2025
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార నిర్వహణ వేగాన్ని (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కేవలం మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపిస్తున్నామని, దీనికి నిదర్శనంగానే గడిచిన 15 నెలల్లో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు సాధించగలిగామని రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక 'భాగస్వామ్య సదస్సు - 2025'కు ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు లండన్‌లో నిర్వహించిన 'ఆంధ్రప్రదేశ్ - యూకే బిజినెస్ ఫోరం' రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, మాకు సుస్థిరమైన, నిరూపితమైన నాయకత్వం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఆయన అనుభవం ఇప్పుడు నవ్యాంధ్రకు దిక్సూచిగా మారింది" అని తెలిపారు. 

రెండో అంశం వ్యాపార నిర్వహణలో వేగానికి ప్రాధాన్యత ఇవ్వడమని, దీనికి ఉదాహరణగా ఆర్సెలర్ మిట్టల్ సంస్థ విషయాన్ని ప్రస్తావించారు. "భారత్‌లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తున్న ఆర్సెలర్ మిట్టల్ సంస్థ, తమకు ఎదురైన మూడు సమస్యలను మా దృష్టికి తీసుకురాగా, కేవలం 12 గంటల్లోనే వాటిని పరిష్కరించాం. అందుకే వారు నవంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు" అని వివరించారు. 

మూడో అంశం, తమ ప్రభుత్వంలో యువ నాయకత్వం ఎక్కువగా ఉండటమని, మంత్రుల్లో 17 మంది కొత్తవారేనని, స్టార్టప్ ఆలోచనా విధానంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని పేర్కొన్నారు.

రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, దేశంలో మరే రాష్ట్రం ఇంత సాహసోపేతమైన హామీ ఇవ్వలేదని లోకేశ్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చబోయే కీలక ప్రాజెక్టుల గురించి వివరిస్తూ, "దక్షిణ ఆసియాలోనే తొలి 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో అమరావతికి రానుంది. ప్రధాని మోదీ క్వాంటమ్ మిషన్‌ను ముందుండి నడిపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో డేటా సిటీ ఏర్పాటుతో రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి. ముంబై కంటే రెట్టింపు సామర్థ్యంతో 1.5 గిగావాట్ల డేటా సెంటర్లు విశాఖకు రానున్నాయి" అని తెలిపారు. 

ఐటీ విప్లవాన్ని భారత్ అందిపుచ్చుకున్నట్టే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దీనికోసం కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఏఐని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెడుతున్నామని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలున్న యువతను తయారుచేయడానికి అక్టోబర్‌లో 'నైపుణ్యం' పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

పరిశ్రమల స్థాపనకు అడ్డంకిగా ఉన్న నిబంధనలను సరళీకృతం చేస్తున్నామని, ఇందులో భాగంగా కార్మిక సంస్కరణలు, ల్యాండ్ కన్వర్షన్, నాలా ట్యాక్స్ వంటి అంశాలపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన సూచనలను కేవలం 45 రోజుల్లోనే అమలు చేశామని లోకేశ్ గుర్తుచేశారు. రాష్ట్రంలో 5,000 ఎకరాల్లో స్పేస్ సిటీ నిర్మించబోతున్నామని, ఇందులో భాగంగా 'స్కైరూట్' సంస్థకు వారం రోజుల్లోనే 300 ఎకరాలు కేటాయించామని తెలిపారు. విజన్ - 2047 లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

టెక్ మహీంద్రా యూరప్ బిజినెస్ హెడ్ హర్షుల్ అస్నానీ సంధానకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో యూకే డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, ఐసీఐసీఐ బ్యాంకు యూకే సీఈఓ రాఘవ్ సింఘాల్, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ అభిషిక్త్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ అంతర్జాతీయ కంపెనీలకు చెందిన 150 మంది సీఈఓలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Nara Lokesh
AP development
Andhra Pradesh
UK Business Forum
Partnership Summit 2025
Visakhapatnam
Arcelor Mittal
IT revolution
Artificial Intelligence
Skill development

More Telugu News