Maoist Party: ఆయుధాలు వదిలేస్తాం.. శాంతి చర్చలకు సిద్ధం: మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన

Maoist Party Announces Ceasefire Offers Peace Talks
  • మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన
  • ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ ప్రకటన నిన్న రాత్రి వెలుగులోకి 
  • నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించి, గాలింపు చర్యలను నిలిపివేయాలని వినతి
భారతదేశంలో పలు రాష్ట్రాల్లో సాయుధ పోరాటం చేస్తున్న మావోయిస్టు పార్టీ తాత్కాలికంగా ఆయుధాలను విడిచిపెట్టి ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలని సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది.

ఆగస్టు 15వ తేదీతో కూడిన ఈ ప్రకటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఇందులో మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని, ప్రజా సమస్యల పరిష్కారానికి గళం విప్పుతామని స్పష్టం చేశారు.

బస్వరాజ్ మృతిపై ఆవేదన – శాంతిపథానికి మద్దతు

పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ మే 21న ఛత్తీస్‌గఢ్‌లోని గుండెకోట్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆ దాడిలో మొత్తం 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ పరిణామాల నేపథ్యంలో బస్వరాజ్ ఆశయాల ప్రకారం పార్టీ శాంతి చర్చల వైపు మొగ్గు చూపిందని అభయ్ ప్రకటించారు.

కేంద్రంతో చర్చలకు సిద్ధమన్న మావోయిస్టులు

శాంతి చర్చల కోసం నెల రోజులపాటు కాల్పుల విరమణ ప్రకటించాలని లేఖలో కేంద్రాన్ని కోరారు. దేశ ప్రధాని ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని నిరంతరం చేసిన అభ్యర్థనల దృష్ట్యా తాము ఆయుధాలను వదలాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఈ అంశాలపై కేంద్ర హోంమంత్రి లేదా ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి తాము సిద్ధమని, తమ అభిప్రాయ మార్పు గురించి పార్టీకి తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. పార్టీకి ఈ అంశాన్ని వివరించి శాంతి చర్చల్లో పాల్గొనే సహచరులతో ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్న సహచరులు, జైళ్లలో ఉన్న వారితో సంప్రదించేందుకు తమకు నెల రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించి, గాలింపు చర్యలను నిలిపివేయడం ద్వారా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ అనుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుందని అభయ్ లేఖలో వివరించారు.

ప్రజలతో ప్రత్యక్ష కమ్యూనికేషన్ – ఈమెయిల్, ఫేస్‌బుక్ ప్రారంభం

తమ నిర్ణయంపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు మావోయిస్టు పార్టీ తొలిసారిగా ఒక ఈమెయిల్ ([email protected]), ఫేస్‌బుక్ ఐడి (nampetalk)ను అందుబాటులోకి తెచ్చింది. ఇది మావోయిస్టు చరిత్రలోనే తొలిసారి ప్రజలతో ప్రత్యక్షంగా కమ్యూనికేట్ చేయడానికి తీసుకున్న చర్యగా భావిస్తున్నారు.

నిఘా వర్గాల స్పందన

ఈ ప్రకటనపై కొన్ని వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటనగానే భావిస్తున్నాయి. ప్రకటనలో కిషన్‌జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ముద్రించడం గమనార్హం. 
Maoist Party
Basavaraj
Naxalites
India
Chhattisgarh
Peace Talks
Gundakot Encounter
Abhay
Nampet
Ceasefire

More Telugu News