China Restaurant: రెస్టారెంట్‌లో టీనేజర్ల అకృత్యం.. తల్లిదండ్రులకు రూ. 2.71 కోట్ల జరిమానా!

Chinese Court Orders Parents To Pay Rs 271 Crore After Drunk Teenagers Urinate In Soup
  • చైనా రెస్టారెంట్‌లో ఇద్దరు టీనేజర్ల అసభ్య ప్రవర్తన
  • మరిగే హాట్‌పాట్ సూప్‌లో మూత్ర విసర్జన
  • తల్లిదండ్రులకు రూ. 2.71 కోట్లు జరిమానా విధించిన కోర్టు
  • కంపెనీ ప్రతిష్ఠ‌కు భంగం కలిగించారని తీర్పు
  • 4,000 మంది కస్టమర్లకు నష్టపరిహారం చెల్లించిన రెస్టారెంట్
పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఇద్దరు టీనేజర్లు ఓ రెస్టారెంట్‌లో చేసిన అకృత్యానికి వారి తల్లిదండ్రులు ఏకంగా 2.2 మిలియన్ యువాన్లు (సుమారు రూ. 2.71 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలంటూ స్థానిక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే... షాంఘైలోని ప్రముఖ 'హైదిలావో' హాట్‌పాట్ రెస్టారెంట్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న 17 ఏళ్ల వూ, టాంగ్ అనే ఇద్దరు మైనర్లు, తాము భోజనం చేస్తున్న ప్రైవేట్ డైనింగ్ రూమ్‌లోని టేబుల్‌పైకి ఎక్కి, అందరూ కలిసి తినే మరిగే సూప్‌లో మూత్ర విసర్జన చేశారు. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి.

ఈ ఘటనతో రెస్టారెంట్ యాజమాన్యం తీవ్రంగా నష్టపోయింది. కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రాకపోయినప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా ఘటన జరిగిన రోజు నుంచి మార్చి 8 వరకు వచ్చిన సుమారు 4,000 మందికి పైగా కస్టమర్లకు పూర్తి డబ్బులు వాపసు ఇవ్వడమే కాకుండా, బిల్లుకు పది రెట్ల నగదును పరిహారంగా చెల్లించింది. అంతేకాకుండా, రెస్టారెంట్‌లోని పాత్రలన్నింటినీ ధ్వంసం చేసి, కొత్తవి కొనుగోలు చేసింది. ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రం చేసి, క్రిమిసంహారకాలతో శుద్ధి చేసింది.

ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన న్యాయస్థానం టీనేజర్ల చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది. వారి ప్రవర్తన కంపెనీ ఆస్తి హక్కులను, ప్రతిష్ఠ‌ను దెబ్బతీసిందని స్పష్టం చేసింది. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో కంపెనీకి జరిగిన నష్టానికి, పాత్రల ఖర్చులకు, న్యాయపరమైన ఫీజులకు కలిపి మొత్తం 2.2 మిలియన్ యువాన్లు చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు పత్రికల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా తీర్పులో పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా 1,000కి పైగా బ్రాంచులు కలిగిన 'హైదిలావో' రెస్టారెంట్ చైన్, తమ అద్భుతమైన కస్టమర్ సర్వీస్‌కు, కుటుంబ అనుకూల వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. అలాంటి రెస్టారెంట్‌లో ఈ ఘటన జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
China Restaurant
Haidilao
Haidilao restaurant
teenagers urination
restaurant fine
parental responsibility
restaurant compensation
Shanghai restaurant incident
minor misconduct
restaurant reputation

More Telugu News