Dhanashree Verma: ఇండస్ట్రీకి నేనే లేడీ సల్మాన్ ఖాన్.. పెళ్లిపై ధనశ్రీ వర్మ షాకింగ్ కామెంట్స్

Dhanashree Verma Shocking Comments on Marriage Lady Salman Khan
  • ప్రేమ, పెళ్లిపై చాహల్ మాజీ భార్య‌ ధనశ్రీ వర్మ కీలక వ్యాఖ్యలు
  • ఇండస్ట్రీకి లేడీ సల్మాన్ ఖాన్‌లా ఉంటానని వ్యాఖ్య‌
  • ప్రస్తుతానికి తన జీవితంలోకి ఎవరినీ ఆహ్వానించనని వెల్లడి
  • గత బంధంలో చాలా చూశానంటూ పరోక్ష వ్యాఖ్యలు
  • చాహల్‌తో విడాకుల తర్వాత కెరీర్‌పైనే దృష్టి పెట్టినట్లు వెల్లడి
ప్రముఖ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా స్టార్ ధనశ్రీ వర్మ తన వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్‌తో విడాకుల తర్వాత తొలిసారిగా ప్రేమ, పెళ్లి గురించి ఆమె ఓపెన్ అయ్యారు. తాను ఇండస్ట్రీకి ‘లేడీ సల్మాన్ ఖాన్’లా ఉండాలనుకుంటున్నానని, ప్రస్తుతానికి తన జీవితంలోకి ఎవరినీ ఆహ్వానించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం అష్నీర్ గ్రోవర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'రైజ్ అండ్ ఫాల్' అనే రియాలిటీ షోలో ధనశ్రీ కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నారు. ఈ షోలో తోటి కంటెస్టెంట్లు నయన్‌దీప్ రక్షిత్, పవన్ సింగ్‌తో మాట్లాడుతూ ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు. "ప్రస్తుతం నా జీవితంలోకి ఎవరూ వద్దు. నా గత సంబంధంలో నేను చాలా చూశాను. అందుకే ఇకపై ఈ ఇండస్ట్రీకి నేను లేడీ సల్మాన్ ఖాన్‌లా ఉంటాను" అని ఆమె స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా తనకు వచ్చిన ఓ కల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాలోని పచ్చని పొలాల్లో తాను ఉన్నట్లు కల వచ్చిందని, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తున్న సమయంలోనే మెలకువ వచ్చిందని తెలిపారు. ఆ కలలో ప్రేమకు సంబంధించిన ప్రస్తావనే లేదని, తన దృష్టి అంతా పరిసరాలపైనే ఉందని వివరించారు. ఈ వ్యాఖ్యల ద్వారా తాను ఒంటరి జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని పరోక్షంగా వెల్లడించారు.

ధనశ్రీ వర్మ, యజువేంద్ర చాహల్ 2020 డిసెంబర్‌లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, నాలుగేళ్ల తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని నెలల క్రితమే వీరి విడాకులు అధికారికంగా ఖరారయ్యాయి. విడాకుల తర్వాత అనవసరమైన డ్రామాకు పోకుండా గౌరవప్రదంగా విడిపోయామని ధనశ్రీ గతంలోనే తెలిపారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా హుందాగా వ్యవహరించినట్లు చెప్పారు. కాగా, యజువేంద్ర చాహల్ ప్రస్తుతం కంటెంట్ క్రియేటర్ ఆర్జే మహ్వష్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తుండగా, ధనశ్రీ మాత్రం తన కెరీర్‌పైనే పూర్తిగా దృష్టి సారించారు.
Dhanashree Verma
Yuzvendra Chahal
Divorce
Lady Salman Khan
Rise and Fall
Reality Show
Dating
RJ Mahvash
Bollywood
Cricket

More Telugu News