Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ను 'పంది' అని పిలిచిన పాక్ మాజీ క్రికెటర్

Mohammad Yousuf Calls Suryakumar Yadav Pig Sparks Controversy
  • షేక్‌హ్యాండ్ వివాదం.. భారత కెప్టెన్‌పై విషం కక్కిన మహ్మద్ యూసుఫ్
  • టీవీ చర్చలో సూర్యకుమార్‌ను పదేపదే ‘పంది’ అంటూ సంబోధించిన వైనం
  • పాక్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియా షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంతో రాజుకున్న వివాదం
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే మైదానంలోనే కాదు, బయట కూడా తీవ్ర ఉద్రిక్తతలు ఉంటాయి. ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన మ్యాచ్ అనంతరం ఈ వాతావరణం మరింత వేడెక్కింది. పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం మహ్మద్ యూసుఫ్, భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేసి పెను దుమారం రేపాడు. పాకిస్థాన్‌లోని ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో అతడు సూర్యకుమార్‌ను ఉద్దేశించి పదేపదే 'పంది' (సువ్వర్) అని సంబోధించాడు.

ఆసియా కప్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంపై జరిగిన చర్చలో యూసుఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. యాంకర్ వారించే ప్రయత్నం చేసినా అతడు తన మాట తీరు మార్చుచుకోలేదు. "భారత్ తమ సినీ ప్రపంచం నుంచి బయటకు రాలేకపోతోంది. అంపైర్లు, మ్యాచ్ రిఫరీల సహాయంతో గెలవాలని చూస్తున్నందుకు సిగ్గుపడాలి" అని కూడా యూసుఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

వివాదానికి అసలు కారణం ఇదే

దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు ముందు గానీ, తర్వాత గానీ ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), భారత ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ఘటన పాకిస్థాన్ శిబిరంలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది.

ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు

ఈ షేక్‌హ్యాండ్ వివాదాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీరియస్‌గా తీసుకుంది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఆయన క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేసింది. అయితే, పీసీబీ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒక దేశం డిమాండ్ మేరకు రిఫరీని మారిస్తే, భవిష్యత్తులో ఇది తప్పుడు సంప్రదాయానికి దారితీస్తుందని, చిన్న దేశాలు కూడా ఇలాంటి డిమాండ్లు చేసే అవకాశం ఉందని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Suryakumar Yadav
Mohammad Yousuf
Asia Cup 2025
India Pakistan match
PCB
ICC
cricket controversy
Andy Pycroft
shakehand controversy
cricket

More Telugu News