SV Rajasekhar Babu: 'నానో బనానా'కు నకిలీలు... ఆ మాయలో పడొద్దు: విజయవాడ పోలీస్ కమిషనర్ హెచ్చరిక

Nano Banana Fake Apps Alert by Vijayawada Police
  • సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ 'నానో బనానా'
  • ఫొటోలను 3డీ చిత్రాలుగా మార్చే ఏఐ టూల్‌కు యువత ఆకర్షణ
  • ఇదే పేరుతో నకిలీ యాప్‌లు, లింకులతో సైబర్ మోసాలు
  • క్లిక్ చేస్తే ఫోన్‌లోకి వైరస్, వ్యక్తిగత డేటా చోరీ
  • అసలైన యాప్‌లు మాత్రమే వాడాలంటూ పోలీసుల హెచ్చరిక
  • మోసపోతే 1930కి కాల్ చేయాలని అధికారుల సూచన
సోషల్ మీడియాలో ప్రస్తుతం గూగుల్ జెమిని 'నానో బనానా' అనే కొత్త ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ట్రెండ్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. సాధారణ ఫొటోలను అప్‌లోడ్ చేసి, చిన్న సందేశం ఇస్తే చాలు... క్షణాల్లో వాటిని అద్భుతమైన 3డీ చిత్రాలుగా, యోధుల రూపంలోకి లేదా పాతకాలం నాటి చిత్రాలుగా మార్చేస్తుండటంతో దీనిపై అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ఈ ట్రెండ్ పేరుతో నకిలీ యాప్‌లు, లింకులు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు హెచ్చరించారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనరేట్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన వెలువరించింది. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'నానో బనానా' పేరుతో సైబర్ కేటుగాళ్లు నకిలీ లింకులను సర్క్యులేట్ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఏది అసలు, ఏది నకిలీ అని తెలియక చాలామంది ఈ లింకులను క్లిక్ చేసి మోసపోతున్నారని తెలిపారు. ఆ లింక్‌ను నొక్కగానే వినియోగదారుల ఫోన్ లేదా కంప్యూటర్‌లోకి ప్రమాదకరమైన వైరస్ ప్రవేశిస్తుందని, దీని ద్వారా వ్యక్తిగత ఫొటోలు, బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి సున్నితమైన సమాచారాన్ని నేరగాళ్లు సులభంగా దొంగిలిస్తున్నారని వివరించారు. ఆ తర్వాత బ్యాంకు ఖాతాల్లోని డబ్బును ఖాళీ చేస్తున్నారని తెలిపారు.

అసలైన 'నానో బనానా' ఏఐ టూల్ గూగుల్ జెమినీకి చెందినదని స్పష్టం చేశారు. బ్రౌజర్‌లో https://gemini.google.com అని టైప్ చేసి, 'జెమినీ నానో బనానా ఏఐ ఇమేజ్ జనరేటర్' ద్వారా సురక్షితంగా ఫొటోలను ఎడిట్ చేసుకోవచ్చని, ఇదే అసలైన వెబ్‌సైట్ అని, ఇతర నకిలీ లింకుల జోలికి వెళ్లవద్దని పోలీసులు సూచించారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

* సోషల్ మీడియాలో కనిపించే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు.
* మీ ఓటీపీ, పాస్‌వర్డ్, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
* తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను వెంటనే డిలీట్ చేయండి.
* ఒకవేళ పొరపాటున అనుమానాస్పద లింక్ క్లిక్ చేశారని భావిస్తే, వెంటనే ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల వైరస్ తొలగిపోతుంది.
* ఏదైనా మోసానికి గురైతే తక్షణమే సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయడం లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.
SV Rajasekhar Babu
Nano Banana
Google Gemini
cyber crime
Vijayawada Police
AI image generator
fake apps
online fraud
cyber security
artificial intelligence

More Telugu News