Kim Jong Un: విదేశీ సంస్కృతికి కిమ్ చెక్.. హ్యాంబర్గర్, ఐస్‌క్రీమ్‌ పదాలపై నిషేధం!

Kim Jong Un Bans Hamburger Ice Cream Words
  • హ్యాంబర్గర్, ఐస్‌క్రీమ్ పదాలకు బదులుగా ఉత్తర కొరియా పేర్లు
  • విదేశీ సంస్కృతిని అరికట్టేందుకే ఈ నిర్ణయమన్న కిమ్
  • నిబంధనలు ఉల్లంఘిస్తే బహిరంగ మరణశిక్షల హెచ్చరిక
  • టూరిస్ట్ గైడ్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తన విచిత్రమైన నిర్ణయాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. తమ దేశంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఉండకూడదన్న ఉద్దేశంతో 'హ్యాంబర్గర్', 'ఐస్‌క్రీమ్', 'కరావోకే' వంటి సాధారణ పదాల వాడకంపై నిషేధం విధించారు. విదేశీ, ముఖ్యంగా దక్షిణ కొరియా పదజాలం స్థానంలో దేశీయ పదాలను మాత్రమే ఉపయోగించాలని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై హ్యాంబర్గర్‌ను 'రొట్టెల మధ్య రుబ్బిన గొడ్డు మాంసం' (దాజిన్-గోగి గ్యోపాంగ్) అని పిలవాలి. అలాగే ఐస్‌క్రీమ్‌ను 'ఎసుకిమో'గా, కరావోకేను 'తెరపై సంగీత పరికరం'గా వ్యవహరించాలి. ముఖ్యంగా వోన్సన్ బీచ్ రిసార్టులో పనిచేసే టూరిస్ట్ గైడ్లకు ఈ విషయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు 'డైలీ ఎన్‌కే' అనే వార్తా సంస్థ నివేదించింది. పర్యాటకులతో మాట్లాడేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన పదాలనే తప్పనిసరిగా వాడాలని వారికి స్పష్టం చేశారు.

కేవలం పదాలకే ఈ నిషేధం పరిమితం కాలేదు. విదేశీ సంస్కృతి, ముఖ్యంగా శత్రు దేశాల నుంచి వచ్చే సమాచారంపై ప్రభుత్వం తీవ్రమైన అణచివేత ధోరణిని అవలంబిస్తోందని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి వెల్లడించింది. 2014 నుంచే ఈ ఆంక్షలు కఠినతరం కాగా, 2015లో విదేశీ మీడియా కంటెంట్ చూడటం, పంపిణీ చేయడమే కాకుండా, సామ్యవాద సిద్ధాంతానికి విరుద్ధమైన పదాలు వాడటాన్ని కూడా నేరంగా పరిగణిస్తూ చట్టాలు చేశారు.

ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి బహిరంగ మరణశిక్షలు సైతం విధిస్తున్నట్లు ఐరాస సమీక్షలో తేలింది. ప్రజల్లో భయాన్ని నాటడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆ నివేదిక పేర్కొంది. 'సామ్యవాద వ్యతిరేక' కార్యకలాపాలను అరికట్టేందుకు ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్నప్పటికీ, చాలామంది పౌరులు రహస్యంగా విదేశీ కంటెంట్‌ను చూస్తున్నారని కూడా కథనాలు వస్తున్నాయి.
Kim Jong Un
North Korea
foreign culture
hamburgers
ice cream
karaoke
language restrictions
Wonsan Beach Resort
Daily NK
United Nations

More Telugu News