Raj Kundra: రూ.60 కోట్ల మోసం కేసులో కీలక పరిణామం.. బిపాసా, నేహా ధూపియా పేర్లు చెప్పిన రాజ్ కుంద్రా

Raj Kundra alleges part of Rs 60 crore fraud amount paid to Bipasha Basu and Neha Dhupia as fees
  • రూ.60 కోట్ల మోసం కేసులో రాజ్ కుంద్రాను విచారించిన ఈఓడబ్ల్యూ
  • డబ్బుల్లో కొంత భాగం బిపాసా, నేహాకు ఫీజుగా ఇచ్చానన్న కుంద్రా
  • నలుగురు హీరోయిన్ల ఖాతాల్లోకి నేరుగా నిధుల బదిలీ గుర్తింపు
  • డీమానిటైజేషన్ సమయంలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు వెల్లడి
  • కీలక ప్రశ్నలకు సమాధానం దాటవేసిన రాజ్ కుంద్రా
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై నమోదైన రూ.60 కోట్ల మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన, డబ్బులో కొంత భాగాన్ని ప్రముఖ హీరోయిన్లు బిపాసా బసు, నేహా ధూపియాలకు ఫీజుల రూపంలో చెల్లించినట్లు చెప్పినట్లు సమాచారం. ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) జరిపిన విచారణలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఈ కేసు విచారణలో భాగంగా ఈఓడబ్ల్యూ అధికారులు రాజ్ కుంద్రాను సుమారు ఐదు గంటల పాటు ప్రశ్నించారు. ఈ సమయంలో హీరోయిన్లకు ఫీజులు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నప్పటికీ, పలు కీలక ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను మరోసారి విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కేసులో రాజ్ కుంద్రాతో పాటు ఆయన భార్య శిల్పాశెట్టిపైనా దర్యాప్తు కొనసాగుతోందని ముంబై పోలీసులు అధికారికంగా వెల్ల‌డించారు.

అధికారులు జరిపిన దర్యాప్తులో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుంద్రా కంపెనీ ఖాతాల నుంచి శిల్పాశెట్టి, బిపాసా బసు, నేహా ధూపియా సహా మొత్తం నలుగురు నటీమణుల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బు బదిలీ అయినట్లు ఆధారాలు లభించాయి. బాలాజీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇప్పటివరకు అధికారులు సుమారు రూ.25 కోట్ల మేర ప్రత్యక్ష బదిలీలను ట్రాక్ చేశారు.

ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) సమయంలో నగదు కొరత ఏర్పడినప్పుడు కంపెనీ నుంచి పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ఈ బదిలీలకు సంబంధించిన ఆధారాలను అధికారులు ఇప్పటికే భద్రపరిచారు. "బెస్ట్ డీల్" కోసం రూపొందించిన వీడియోలను సమర్పించాలని కుంద్రాను ఆదేశించగా, వాటిని ఇప్పటికే ప్రాపర్టీ సెల్‌కు ఇచ్చానని ఆయన తెలిపారు. అయినప్పటికీ, తదుపరి పరిశీలన కోసం వాటిని మళ్లీ స్వాధీనం చేసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో మరికొంత మందిని విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
Raj Kundra
Shilpa Shetty
Bipasha Basu
Neha Dhupia
60 crore fraud case
Mumbai Police EOW
Bollywood actresses
money laundering
financial investigation
Balaji Entertainment

More Telugu News