మహిళా అధికారి ఇంట్లో 'కట్టల' పాములు.. కోట్లలో నగదు, నగలు సీజ్!

  • అసోంలో అవినీతి అధికారిణి నుపూర్ బోరా అరెస్ట్
  • రూ. 1.02 కోట్ల నగదు, కోటి రూపాయల విలువైన నగలు సీజ్
  • అక్రమ భూ బదలాయింపుల ద్వారా ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు
  • ఆరు నెలలుగా నిఘా పెట్టి పట్టుకున్నామని చెప్పిన సీఎం హిమంత
  • ఆమెకు సహకరించిన మరో ఉద్యోగిపైనా విజిలెన్స్ దాడులు
అసోంలో ఓ మహిళా ప్రభుత్వ అధికారి ఇంట్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై అస్సాం సివిల్ సర్వీస్ (ఏసీఎస్) అధికారిణి నుపూర్ బోరాను ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. గువాహటిలోని ఆమె నివాసంలో జరిపిన సోదాల్లో సుమారు రూ. 2 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.

విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గువాహటిలోని నుపూర్ బోరా ఇంట్లో జరిపిన తనిఖీల్లో రూ. 92 లక్షల నగదు, దాదాపు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలు లభించాయి. దీంతో పాటు, బార్‌పేటలో ఆమె అద్దెకు ఉంటున్న మరో ఇంట్లో సోదాలు చేయగా అదనంగా మరో రూ. 10 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గోలాఘాట్‌కు చెందిన నుపూర్ బోరా 2019లో ఏసీఎస్ అధికారిణిగా విధుల్లో చేరారు. ప్రస్తుతం ఆమె కామ్రూప్ జిల్లాలోని గొరైమారిలో సర్కిల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ నుపూర్ బోరాపై ఆరు నెలలుగా నిఘా ఉంచామని తెలిపారు. "బార్‌పేట రెవెన్యూ సర్కిల్‌లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఆమె డబ్బు తీసుకుని హిందువుల భూములను అనుమానాస్పద వ్యక్తులకు బదిలీ చేశారు. అందుకే ఆమెపై కఠిన చర్యలు తీసుకున్నాం" అని సీఎం వివరించారు.

మైనారిటీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోని రెవెన్యూ సర్కిళ్లలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని హిమంత ఆరోపించారు. ఈ కేసులో భాగంగా నుపూర్ బోరాకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్‌పేట రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే లత్ మండల్ సురజిత్ డేకా నివాసంలో కూడా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నుపూర్ బార్‌పేటలో సర్కిల్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు ఆమెతో కుమ్మక్కై సురజిత్ బార్‌పేటలో అనేక భూములను అక్రమంగా సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి.


More Telugu News