Tanushree Dutta: తెలియని మగాడితో ఒకే మంచంపై పడుకోలేను: బిగ్ బాస్ పై తనుశ్రీ దత్తా తీవ్ర విమర్శలు

Bigg Boss is terrible says Tanushree Dutta
  • కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ షోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన తనుశ్రీ దత్తా
  • గత 11 ఏళ్లుగా బిగ్ బాస్ నుంచి ఆఫర్లు వస్తున్నాయని వెల్లడి
  • అది చాలా దారుణమైన షో అని తీవ్ర విమర్శలు
బాలీవుడ్ నటి, ‘మీటూ’ ఉద్యమంతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన తనుశ్రీ దత్తా, ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కోట్లాది రూపాయలు ఆఫర్ చేసినా ఆ షోలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. అదొక దారుణమైన షో అని విమర్శించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

గత 11 ఏళ్లుగా బిగ్ బాస్ నిర్వాహకులు తనను సంప్రదిస్తూనే ఉన్నారని తనుశ్రీ తెలిపారు. ఈసారి ఏకంగా రూ.1.65 కోట్లు ఇస్తామని చెప్పినా తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు. "ఇప్పుడే కాదు, నా జీవితంలో ఎప్పటికీ నేను బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లను. ఎవరు వచ్చి ఎంత చెప్పినా, ఆకాశంలోని చందమామను తీసుకొచ్చి ఇస్తామన్నా నా నిర్ణయం మారదు" అని ఆమె స్పష్టం చేశారు.

షోలో పాల్గొనకపోవడానికి గల కారణాలను వివరిస్తూ, అక్కడి వాతావరణం తనకు ఏమాత్రం నచ్చదని చెప్పారు. "ఒక రియాలిటీ కోసం ఎవరో తెలియని వ్యక్తి పక్కన ఒకే మంచంపై పడుకోవాలా? నేనంత చీప్ కాదు. ఒకే గదిలో ఆడ, మగ కలిసి ఉండటం, ఒకే బెడ్‌పై పడుకోవడం జరుగుతుంది. నాకు అలాంటివి ఇష్టం ఉండవు. నాకంటూ కొన్ని ఆహారపు అలవాట్లు ఉన్నాయి. వాటిని నేను మార్చుకోలేను," అని తనుశ్రీ వివరించారు.

కాగా, తనుశ్రీ దత్తా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. నందమూరి బాలకృష్ణ సరసన 'అల్లరి పిడుగు', 'వీరభద్ర' వంటి చిత్రాల్లో ఆమె హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత బాలీవుడ్‌కే పరిమితమైన ఆమె, మీటూ ఉద్యమానికి మద్దతుగా గళం విప్పి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 
Tanushree Dutta
Bigg Boss
Tanushree Dutta Bigg Boss
MeToo movement
reality show
Bollywood actress
Allari Pidugu
Veerabhadra
Nandamuri Balakrishna
Indian celebrity

More Telugu News