Cyber Crime: తక్కువ ధరకే సరుకంటూ వల.. రూ.40 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాదీ వ్యాపారి

Hyderabad Businessman Duped of Rs 40 Lakh in Online Shopping Scam
  • టెలిగ్రామ్‌లో బల్క్ వస్తువుల ప్రకటన చూసి మోసపోయిన వ్యాపారి
  • తక్కువ ధర ఆశ చూపి రూ.39.7 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
  • అడ్వాన్స్ పేరుతో మొదట రూ.10 లక్షల వసూలు
  • డెలివరీ చేయకుండా రకరకాల కారణాలతో మరిన్ని డబ్బులు గుంజేసిన వైనం
  • మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
ఆన్‌లైన్‌లో కనిపించిన ఓ బంపర్ ఆఫర్ ఓ వ్యాపారిని నిలువునా ముంచింది. తక్కువ ధరకే పెద్దమొత్తంలో సరుకులు ఇస్తామన్న ప్రకటనను గుడ్డిగా నమ్మి, ఏకంగా రూ.39.7 లక్షలు సైబర్ నేరగాళ్ల చేతిలో పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ భారీ మోసం వివరాలను సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత మీడియాకు వెల్లడించారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
మెహిదీపట్నంకు చెందిన 28 ఏళ్ల యువ వ్యాపారికి సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో వస్తువులు కొనుగోలు చేయడం అలవాటు. ఈ క్రమంలోనే గత మే 13న టెలిగ్రామ్‌లో ఓ ప్రకటన అతని దృష్టిని ఆకర్షించింది. వివిధ రకాల వస్తువులను బల్క్‌గా అత్యంత చౌక ధరకు విక్రయిస్తామని ఆ ప్రకటనలో ఉండటంతో, అతను వెంటనే వారిని సంప్రదించాడు. రూ.30 లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అయితే, సరుకులు డెలివరీ చేయాలంటే ముందుగా రూ.9,99,990 అడ్వాన్స్‌గా చెల్లించాలని సైబర్ నేరగాళ్లు షరతు పెట్టారు. వారి మాటలు నమ్మిన వ్యాపారి ఆ మొత్తాన్ని వారికి పంపించాడు. డబ్బు అందిన తర్వాత కూడా వస్తువులు రాకపోవడంతో అనుమానంతో వారిని ప్రశ్నించాడు. దీంతో వారు మరో నాటకానికి తెరలేపారు. డెలివరీ పూర్తి కావాలంటే అదనంగా మరో రూ.3 లక్షలు చెల్లించాలని మెలికపెట్టారు. చేసేదేమీ లేక ఆ డబ్బు కూడా పంపించాడు.

అయినా సరుకులు పంపకుండా, రకరకాల కారణాలు చెబుతూ విడతలవారీగా అతని నుంచి డబ్బు గుంజుతూనే ఉన్నారు. ఇలా మొత్తం రూ.39.7 లక్షలు చెల్లించిన తర్వాత తాను మోసపోయానని వ్యాపారి గ్రహించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Cyber Crime
Hyderabad Businessman
Online Fraud
Telegram
Mehdipatnam
Online Shopping
Cyber Fraud
Investment Fraud
Financial Cybercrime
Telangana Cybercrime

More Telugu News