Income Tax Returns: చివరి నిమిషంలో గుడ్ న్యూస్.. ఐటీ రిటర్నుల దాఖలుకు పెరిగిన గడువు

Taxpayers Get One Day Extension for ITR Filing
  • పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించిన సీబీడీటీ
  • మంగళవారం వరకు రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం
  • ఆఖరి రోజు పోర్టల్‌పై పెరిగిన ఒత్తిడితో కీలక నిర్ణయం
  • ఇప్పటికే 7 కోట్లు దాటిన ఐటీఆర్ ఫైలింగ్‌ల సంఖ్య
  • గడువు దాటితే రూ. 5,000 వరకు ఆలస్య రుసుము
ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఊరట కల్పించింది. 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్ గడువును మరో రోజు పొడిగిస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రోజు కూడా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం లభించింది.

నిజానికి ఐటీఆర్ దాఖలుకు సోమవారమే చివరి తేదీ. అయితే, గడువు ముగుస్తుండటంతో చివరి నిమిషంలో లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఒకేసారి ఫైలింగ్ పోర్టల్‌ను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోర్టల్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగి, పలు సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం సీబీడీటీ గడువును ఒక రోజు పెంచింది.

కాగా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. వీటిలో ఇప్పటికే 6.03 కోట్ల రిటర్నులను అధికారులు వెరిఫై చేయగా, 4 కోట్ల ఐటీఆర్‌ల ప్రాసెసింగ్‌ను కూడా పూర్తి చేశారు.

పొడిగించిన గడువును కూడా వినియోగించుకోలేని వారు బుధవారం నుంచి జరిమానాతో రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు దాటిన వారికి రూ. 5,000, రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రూ. 1,000 ఆలస్య రుసుముతో పాటు వడ్డీ కూడా వర్తిస్తుంది.
Income Tax Returns
CBDT
ITR Filing
Tax Filing Deadline
ITR Extension
Income Tax Department
Tax Payers
Assessment Year 2025-26
Tax Filing Portal
Late Fee

More Telugu News